రోజా సొంత ఖర్చుతో జగనన్న సంబరాలు.. నమ్మేదెలా.. ?

జగన్ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాలు చేస్తుంటే టీడీపీకి, ఆ పార్టీ అనుకూల మీడియాకి కడుపుమంట పెరిగిపోతోందని ఎద్దేవా చేశారు రోజా. జగన్ ని సంక్షేమ సామ్రాట్ అని కొనియాడారు.

Advertisement
Update:2022-12-20 20:59 IST

రోజా సొంత ఖర్చుతో జగనన్న సంబరాలు.. నమ్మేదెలా.. ?

ఈనెల 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా.. ముందస్తుగా రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా కళాకారులకు పోటీలు పెట్టి విజేతలను ఖరారు చేశారు. నెలరోజులపాటు జరిగిన ఈ కార్యక్రమాల బిల్లు అక్షరాలా 2.6 కోట్ల రూపాయలని, ఒక ముఖ్యమంత్రి పుట్టినరోజుకి ఇంత ఖర్చు చేయాలా అని టీడీపీ అనుకూల మీడియా కథనాలిచ్చింది. దీంతో వైసీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. అసలు జగనన్న సాంస్కృతిక సంబరాలకు, ప్రభుత్వం నిధులు కేటాయించలేదని వివరణ ఇచ్చారు మంత్రి రోజా. ప్రభుత్వం నిధులిస్తే జీవో చూపించాలని ప్రశ్నించారామె.

రోజా సొంత ఖర్చు..

జగనన్న సాంస్కృతిక సంబరాలకు ప్రభుత్వం నిధులివ్వలేదు సరే, మరి డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ వేడుకలు నిర్వహించేందుకు స్పాన్సర్స్ ఎవరు. ఇంకెవరు, ఈ వేడుకల్ని నిర్వహిస్తున్న రోజాయేనని చెబుతున్నారు మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు. రోజా సొంత ఖర్చుతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఓర్చుకోలేక తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు.

కడుపుమంటకు జెలుసిల్ వాడండి..

జగన్ పుట్టినరోజు సందర్భంగా కార్యక్రమాలు చేస్తుంటే టీడీపీకి, ఆ పార్టీ అనుకూల మీడియాకి కడుపుమంట పెరిగిపోతోందని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆమె, జగన్ ని సంక్షేమ సామ్రాట్ అని కొనియాడారు. కళాకారులకు మంచి చేస్తుంటే కొంతమంది చూసి ఓర్వలేకపోతున్నారని, అలాంటి వారందరికీ జెలుసిల్ బాటిల్స్ పంపించాలన్నారు.

అట్టహాసంగా జగన్ పుట్టినరోజు వేడుకలు..

సాంస్కృతిక సంబరాల పేరుతో నెలరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జగన్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక రేపు(డిసెంబర్-21) జగన్ పుట్టినరోజు సందర్భంగా నాయకులు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నవారు.. ఇలా అందరూ జగన్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు, ఆ కార్యక్రమాలను అంతకంటే ఘనంగా ప్రచారం చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

Tags:    
Advertisement

Similar News