వినుకొండకు జగన్.. కాన్వాయ్ లో గందరగోళం
ఇన్నాళ్లు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించిన పోలీసులు సరిగ్గా నడవని బీపీ వాహనాన్ని జగన్ కు ఇచ్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వినుకొండ బయలుదేరారు. అయితే ఆయన కాన్వాయ్ పై పోలీసులు ఆంక్షలు విధించారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. జగన్ తోపాటు వినుకొండకు బయలుదేరిన మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల కార్లను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారని, వారిని ఆపివేశారని చెబుతున్నారు. తాడేపల్లి, మంగళగిరి, గుంటూరులో తమ వాహనాలు ఆపేసిన పోలీసులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బుల్లెట్ ప్రూఫ్ వాహనం తొలగింపు..
ఇన్నాళ్లు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించిన పోలీసులు సరిగ్గా నడవని బీపీ వాహనాన్ని జగన్ కు ఇచ్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ వాహనం సరిగా లేకపోవడంతో ఆయన ప్రైవేట్ వాహనం లో వినుకొండ వెళ్తున్నారని చెబుతున్నారు. అడుగడుగునా జగన్ కి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. జగన్ ని ప్రజల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకున్నా, ప్రజాభిమానాన్ని అడ్డుకోలేకపోయిందని అంటున్నారు వైసీపీ నేతలు.
టీడీపీ కౌంటర్లు..
జగన్ వినుకొండ యాత్రపై టీడీపీ, జనసేన కౌంటర్లు మొదలు పెట్టింది. నాడు పవన్ కల్యాణ్ ని ప్రజల్లోకి వెళ్లకుండా జగన్ అడ్డుకున్నారని, ఇప్పుడు మాత్రం ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని జనసేన నేతలు మండిపడుతున్నారు. జైలులో ఉన్న పిన్నెల్లిని కలిసేందుకు ప్రైవేట్ హెలికాప్టర్ లో వెళ్లిన జగన్, రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆకాశ మార్గాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదని వెటకారం చేస్తున్నారు. మొత్తమ్మీద జగన్ వినుకొండ పరామర్శ యాత్ర ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.