జగన్ కి ఓ న్యాయం, శ్రీదేవికి మరో న్యాయమా..?

జగన్ పై పోస్టింగ్ లు పెడితే వెంటనే అరెస్ట్ చేస్తున్నారు, మరి దళిత మహిళా ఎమ్మెల్యేని నీఛంగా విమర్శిస్తే పోలీసులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారని ప్రశ్నిస్తున్నారు ఆమె అనుచరులు.

Advertisement
Update:2023-03-31 07:57 IST

సోషల్ మీడియాలో ట్రోలింగ్, ఫోటొ మార్ఫింగ్ లతో అసభ్య కామెంట్లు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. సినీ తారల్లో చాలామంది వాటిని లైట్ తీసుకుంటున్నారు, దాన్ని కూడా ఓ పబ్లిసిటీగా భావిస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలతో రాజకీయ నాయకుల ఇమేజ్ డ్యామేజీ అవుతోంది. ఏపీలో సీఎం జగన్ ని ట్రోల్ చేసిన చాలామందిని పోలీసులు ఆరెస్ట్ చేశారు. అప్పట్లో టీడీపీ నేత పట్టాభి విషయంలో జరిగిన రాద్ధాంతం అందరికీ తెలిసిందే. గన్నవరంకి చెందిన పొందూరు కోటిరత్నం అంజన్ అరెస్ట్.. ఈ ఎపిసోడ్ లో తాజా పరిణామం. కోటిరత్నం తప్పేమీ లేదని టీడీపీ నేతలు అంటున్నారు, అయితే అతడిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. వీటిలో ఏది నిజమో ఎంత నిజమో విచారణలో తేలాల్సి ఉంది.

జగన్ పై పోస్టింగ్ లు పెడితే వెంటనే అరెస్ట్ చేస్తున్నారు కదా, మరి మా ఎమ్మెల్యే శ్రీదేవి విషయంలో ఎందుకంత చొరవ చూపట్లేదు అంటున్నారు ఆమె అనుచరులు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని ఇటీవల పార్టీ సస్పెండ్ చేసింది. అప్పటినుంచి ఆమెపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. వైసీపీ సానుభూతి పరులే ఎక్కువగా ఆమెపై మాటల దాడి చేస్తున్నారు, అసభ్యకర పోస్టింగ్ లు పెడుతున్నారు. దీనిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు దళిత సంఘాల నేతలు.

మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు..

ఎమ్మెల్యే శ్రీదేవిపై అసభ్యకర పోస్టింగ్ లు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలంటూ మంగళగిరి నియోజకవర్గ దళిత నాయకులు, దళిత సంఘాల నాయకులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీదేవితోపాటు, ఆమె కుమార్తెలను కూడా దుర్భాషలాడుతున్నారని, అవమానిస్తున్నారని అన్నారు. మధురెడ్డి, నాగార్జున, బోరుగడ్డ అనీల్‌, అనితారెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు కొంతమంది ఇంకా వైసీపీలోనే ఉన్నారు. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి, కార్యదర్శి, ఇతర నాయకులు ఈ ఫిర్యాదు చేశారు. మరోవైపు ఏపీ ఎమ్మార్పీఎస్ నేతలు కూడా అసభ్యకర పోస్టింగ్ లపై మండిపడ్డారు. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.


జగన్ పై పోస్టింగ్ లు పెడితే వెంటనే అరెస్ట్ చేస్తున్నారు, మరి దళిత మహిళా ఎమ్మెల్యేని నీఛంగా విమర్శిస్తే పోలీసులు ఎందుకు చూస్తూ ఊరుకున్నారని ప్రశ్నిస్తున్నారు ఆమె అనుచరులు. వైసీపీలో ఉంటే మంచివారిగా కనిపిస్తారని, పార్టీయే దూరం పెట్టినా శ్రీదేవిని టార్గెట్ చేశారని అంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News