అధికారపార్టీ ఒత్తిళ్లలో పోలీస్ వ్యవస్థ -జగన్ ట్వీట్

టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు, సోషల్‌ మీడియా సైనికుడికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు జగన్.

Advertisement
Update:2024-06-06 14:28 IST

ఏపీలో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందంటూ ట్వీట్ వేశారు వైసీపీ అధినేత జగన్. అధికార పార్టీ ఒత్తిళ్లు పోలీస్ వ్యవస్థపై ఉన్నాయని చెప్పారాయన. ఐదేళ్లు పటిష్టంగా ఉన్న శాంతిభద్రతలు ఇప్పుడు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కోట్ చేస్తూ ట్వీట్ చేశారు జగన్.


"రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది." అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జగన్. గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని గవర్నర్ ని కోరారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు, సోషల్‌ మీడియా సైనికుడికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు జగన్.

ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం దాదాపుగా ప్రతి జిల్లాలో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయా ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లలో ఆ వీడియోలను పోస్ట్ చేస్తూ ఇదేనా మార్పు అని టీడీపీని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. నేరుగా జగన్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడం, గవర్నర్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ వేయడం విశేషం. దీనిపై టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News