రేపే లిస్ట్ విడుదల..! వైసీపీ ఎమ్మెల్యేలలో హై టెన్షన్
టికెట్ ఇవ్వను అని ఇద్దరు ఎమ్మెల్యేలకు చెబితేనే ఒక ఎమ్మెల్సీ సీటు పోయింది. మిగతావారి లిస్ట్ కూడా బయటకు వస్తే, ఎంత వ్యతిరేకత వస్తుందో జగన్ ఊహించగలరు.
ఏప్రిల్ 3వతేదీ గడప గడప కార్యక్రమంపై మూడోసారి సీఎం జగన్ సమీక్ష నిర్వహించబోతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లు, సమన్వయకర్తలు.. ఈ కార్యక్రమానికి హాజరవుతారు. నలుగుర్ని తీసేశారు కాబట్టి ఈసారి జగన్ తో కలిసి 147మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వరుసగా 4 ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయిన సందర్భంలో ఈ సమావేశం హాట్ హాట్ గా జరిగే అవకాశముంది.
అంతకు మించి..
కేవలం గడప గడప సమీక్షతో ఈ కార్యక్రమాన్ని సరిపెట్టేలా లేరు, అంతకు మించి అక్కడ ఏదో జరగబోతోందనే ఊహాగానాలు వినపడుతున్నాయి. కొత్త మంత్రి వర్గం కూర్పుకి సంబంధించిన లీకులు ఇచ్చే అవకాశముంది. అక్కడితో ఆగితే పర్వాలేదు, వచ్చే దఫా టికెట్ కోల్పోయేవారి జాబితా కూడా ఈ సమావేశంలోనే చదివి వినిపిస్తారనే మాటే ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మంత్రి పదవి ఉన్నా లేకపోయినా ఒకటే అంటూ సీదిరి అప్పలరాజు చెప్పినంత ఈజీ కాదు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా వైసీపీలోనే ఉంటామని నాయకులు చెబితే నమ్మేంత అమాయకులు ఎవరూ లేరు. పోనీ అప్పటికప్పుడు ఆ మాట చెప్పి సరిపెట్టినా.. ఎన్నికల్లో తమ ప్రతాపం ఏంటో తమపైన తెచ్చిపెట్టిన నాయకుడికి అర్థమయ్యేలా చేయాలనుకుంటారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. పైగా టీడీపీ గేలం పట్టుకుని రెడీగా ఉంది.
వైసీపీ బయటకు పంపించిన నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు పార్టీకి వీర విధేయులు. ఈ జీవితం జగన్ కోసమే, ఈ జన్మ వైసీపీ కోసమే, ఈ గుండె కొట్టుకునేది జగన్ జగన్ అంటూ చెప్పినవారే. అలాంటి వారే పార్టీని వీడారంటే.. ఎమ్మెల్యే టికెట్ లేదు అని చెప్పిన తర్వాత మిగతావారు పార్టీలో ఉంటారనుకోవడం అత్యాశే. టికెట్ ఇవ్వను అని ఇద్దరు ఎమ్మెల్యేలకు చెబితేనే ఒక ఎమ్మెల్సీ సీటు పోయింది. మిగతావారి లిస్ట్ కూడా బయటకు వస్తే, ఎంత వ్యతిరేకత వస్తుందో జగన్ ఊహించగలరు. మరి ఇంత తొందరగా ఆ లిస్ట్ బయటపెడతారా లేదా అనేది కూడా అనుమానమే.
ఒకవేళ నాన్చివేత ధోరణిలో వెళ్తే మొదటికే మోసం వస్తుందనే అనుమానం కూడా ఉంది. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదు సరే, కొత్తగా నియమించే ఇన్ చార్జ్ ల పనితీరు అంచనా వేసుకోడానికయినా జగన్ కి సమయం కావాలి కదా. అందుకే ఆయన కాస్త తొందరపడుతున్నారు. లిస్ట్ ప్రకటిస్తే భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుంటారు, లిస్ట్ లేకుండా కేవలం హెచ్చరికలతో సరిపెడితే ఎమ్మెల్యేలు మరికొన్నిరోజులు టెన్షన్ పడటం ఖాయం. మొత్తమ్మీద ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశంపైనే ఈసారీ అందరి దృష్టీ నెలకొని ఉంది.