లండన్ నుంచి తిరిగొచ్చిన జగన్.. పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహం
చంద్రబాబు జైలు వ్యవహారాన్ని వారు విజయంగా భావిస్తున్నట్టు తేలిపోయింది. ఆ విజయోత్సాహం అంతా ఎయిర్ పోర్ట్ లో కనపడింది. జగన్ ఫీలింగ్స్ మాత్రం ఎప్పటిలాగే ఉండటం విశేషం.
చంద్రబాబు జైలుకెళ్లడంతో వైసీపీ పండగ చేసుకుంటోంది. కొందరు నేతలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచిపెట్టుకున్నారు కూడా. సీఎం జగన్ లండన్ పర్యటన ముగించుకుని రావడంతో పార్టీ నేతలు అదే విజయోత్సాహంతో ఆయన్ను కలుసుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అధికారుల రాక సహజమే, అయితే పార్టీ నేతల్లో మాత్రం కొత్త ఉత్సాహం స్పష్టంగా కనపడింది. చంద్రబాబు జైలు వ్యవహారాన్ని వారు విజయంగా భావిస్తున్నట్టు తేలిపోయింది. ఆ విజయోత్సాహం అంతా ఎయిర్ పోర్ట్ లో కనపడింది. జగన్ ఫీలింగ్స్ మాత్రం ఎప్పటిలాగే ఉండటం విశేషం.
దారి పొడవునా ఘన స్వాగతం..
జగన్ పర్యటనల తర్వాత తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కి చేరుకునే క్రమంలో అక్కడ హడావిడి ఏమీ కనపడదు. కానీ ఆయన లండన్ నుంచి తిరిగొచ్చిన సందర్భంలో మాత్రం గన్నవరం నుంచి తాడేపల్లి వరకు నాయకులు పోటీపడి స్వాగత ఏర్పాట్లు చేశారు. బ్యారికేడ్ల వెనక ప్రజలంతా ప్లకార్డులు పట్టుకుని జగన్ కి స్వాగతం పలికారు. మొత్తమ్మీద చంద్రబాబు ఎపిసోడ్ తర్వాత వైసీపీలో హడావిడి బాగా పెరిగిందనే విషయం మాత్రం స్పష్టమైంది.
ఈరోజు సమీక్షలతో బిజీ..
లండన్ పర్యటన తర్వాత సీఎం జగన్ విశ్రాంతి తీసుకునేలా లేరు. ఈరోజు శాంతి భద్రతల అంశంపై హోం శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, పోలీస్ వ్యవహారాలపై ఆయన నివేదికలు పరిశీలిస్తారు. అయితే చంద్రబాబు అరెస్ట్ పై జగన్ స్పందిస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. గతంలో అవకాశం ఉన్నా లేకపోయినా, చంద్రబాబు ప్రస్తావనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేవారు జగన్. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తో పార్టీ ఉత్సాహం నిండిపోయింది. ఈ సందర్భంలో జగన్ స్పందన ఎలా ఉంటుందనేది అందరికీ ఆసక్తిగా మారింది.