ఢిల్లీలో ఏపీ పాలిటిక్స్.. జగన్ వచ్చారు, బాబు వెళ్తున్నారు

జగన్ ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టారు, చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారు. శాంతి భద్రతల విషయంలో రెండు పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.

Advertisement
Update:2024-07-26 09:33 IST

ఢిల్లీలో ధర్నా తర్వాత మాజీ సీఎం జగన్ ఏపీకి తిరిగొచ్చేశారు. ఇప్పుడు తాజా సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్తారు. రాత్రి 8 గంటలకు ఢిల్లీలోని వన్ జన్ పథ్ రోడ్డులోని నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. రేపు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతిఆయోగ్ సమావేశానికి ఆయన హాజరవుతారు. అనంతరం ఆయన ప్రధాని సహా కేంద్ర మంత్రులతో విడివిడిగా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధుల కేటాయింపు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీపై వారికి ధన్యవాదాలు తెలిపే అవకాశముంది.

ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా రెండు రోజుల క్రితం ఢిల్లీలో జగన్ ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలపై దాడులు పెరుగుతున్నాయని, హత్యలు, అఘాయిత్యాలతో ఏపీ అట్టుడుకుతోందని, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇండియా కూటమికి చెందిన పలు జాతీయ పార్టీల నేతలు కూడా వైసీపీ ధర్నాకు మద్దతు తెలిపారు. ఆ తర్వాత పలువురు కేంద్ర పెద్దల్ని కలిసేందుకు జగన్ ప్రయత్నించారు. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కోసం కూడా ట్రై చేశారు. అవేవీ కుదరకపోవడంతో తిరిగి ఏపీకి వచ్చారు.

అసెంబ్లీ తొలిరోజు సమావేశాలకు హాజరైన వైసీపీ నేతలు, గవర్నర్ ప్రసంగం ముగియక ముందే వాకౌట్ చేశారు. అసెంబ్లీ గేటు వద్ద నల్లకండువాలతో చేపట్టిన నిరసన గందరగోళానికి దారి తీసింది. ఈ దశలో నేడు జరుగుతున్న చివరిరోజు సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అనేది అనుమానమే. అటు కూటమి ప్రభుత్వం మాత్రం వరుస శ్వేత పత్రాలతో వైసీపీపై ఎదురుదాడి చేస్తోంది. ఢిల్లీలో వైసీపీ ధర్నా విఫలయత్నం అని అని విమర్శిస్తోంది టీడీపీ. జంతర్ మంతర్ వద్ద ఫొటో ఎగ్జిబిషన్ కి కౌంటర్ గా అసెంబ్లీలో శాంతి భద్రతల శ్వేత పత్రం విడుదలచేసి ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారు చంద్రబాబు. 

Tags:    
Advertisement

Similar News