తాడేపల్లి చేరుకున్న జగన్.. నెక్ట్స్ ఏంటి..?
పార్టీని పటిష్టపరిచేందుకు జగన్ ఎలాంటి ప్రణాళిక అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేవలం కూటమి తప్పులకోసం ఎదురు చూస్తారా, లేక తన ప్రయత్నం తాను మొదలు పెడతారా అనేది వేచి చూడాలి.
వైసీపీ అధినేత జగన్ తాడేపల్లికి చేరుకున్నారు. అంతకు ముందు ఆయనకు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. జగన్ వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. వారితో మాట్లాడి అనంతరం అక్కడినుంచి తాడేపల్లికి వచ్చారు.
నెక్స్ట్ ఏంటి..?
ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ తర్వాత ఆయన వరుసగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో విడివిడిగా మాట్లాడారు. ఈవీఎంల గురించి ఆసక్తికర ట్వీట్ వేశారు కూడా. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన నేరుగా సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లి అక్కడ నేతలు, కార్యకర్తల్ని కలిశారు. అనంతరం బెంగళూరు వెళ్లారు. అక్కడ కొన్నిరోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి ఏపీకి వచ్చారు. ఈ మధ్యలో ప్రతిపక్ష హోదా గురించి కూడా జగన్ అసెంబ్లీ స్పీకర్ కు ఓ లేఖ రాశారు. ఇప్పుడు జగన్ తిరిగి ఏపీకి రావడంతో ఆ పార్టీ నేతల్లో కదలిక వచ్చింది. చాలామంది జగన్ ని కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకుంటున్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఆయనకు వివరించేందుకు వస్తున్నారు.
ఏపీలో టీడీపీ దాడులు పెరిగిపోతున్నాయని, రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని జగన్ ఇదివరకే ఆరోపించారు. దాడుల్లో గాయపడిన కుటుంబాలను స్థానిక నేతలు పరామర్శించాలని, వారికి అండగా నిలబడాలని కూడా సూచించారు. స్వయంగా తానే ఆయా కుటుంబాలను కలుస్తానని కూడా చెప్పారు. ఇప్పుడు జగన్ ఓదార్పు యాత్ర చేపడతారా లేదా అనేది తేలాల్సి ఉంది. కూటమి ప్రభుత్వానికి మరికొన్ని రోజులు సమయం ఇచ్చి ఆయన జనంలోకి వస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. స్థానిక సంస్థల ప్రతినిధులు కొందరు పార్టీ ఫిరాయిస్తున్నారనే సమాచారం ఉంది. వారందరినీ జగన్ పిలిపించుకుని మాట్లాడతారేమో చూడాలి. పార్టీ పటిష్టం కోసం ఆయన ఎలాంటి ప్రణాళిక అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేవలం కూటమి తప్పులకోసం జగన్ ఎదురు చూస్తారా, లేక తన ప్రయత్నం తాను మొదలు పెడతారా అనేది వేచి చూడాలి.