తొలి జాబితా సిద్ధం చేసిన జ‌గ‌న్‌.. దసరాకు ముహూర్తం

2024 ఎన్నికల్లో వైనాట్ 175.. లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ దిశగా నేతలు, క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించేశారు.

Advertisement
Update:2023-08-22 08:03 IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. మ‌రోసారి విజ‌య‌బావుటా ఎగ‌రేసేందుకు జ‌గ‌న్ అస్త్రశ‌స్త్రాలు సిద్ధం చేసుకుంటుండ‌గా, ఈసారి గెల‌వ‌క‌పోతే పార్టీ మ‌నుగ‌డే క‌ష్ట‌మ‌నే ప‌రిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ క్ర‌మంలో ఎవ‌రికివారు ఎన్నిక‌ల వ్యూహాల నుంచి అభ్య‌ర్థుల ఎంపిక వ‌ర‌కు శ‌క్తియుక్తుల‌న్నీ ఉప‌యోగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అభ్య‌ర్థుల జాబితాను కూడా సిద్ధం చేసుకుంటున్న అధికార‌, విప‌క్షాలు విజ‌య‌ద‌శ‌మినే అందుకు ముహూర్తంగా నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తొలి జాబితాను ఇప్ప‌టికే సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం. మొత్తం అభ్య‌ర్థుల జాబితాను మూడు విడ‌త‌లుగా విడుద‌ల చేయాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా 3 లేదా 4 విడ‌త‌లుగా అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

2024 ఎన్నికల్లో వైనాట్ 175.. లక్ష్యంగా పెట్టుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ దిశగా నేతలు, క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించేశారు. మొత్తం మూడు విడతలుగా అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని పార్టీ సంకల్పించింది. ఇందులో భాగంగా తొలి జాబితా దాదాపు ఖ‌రారైంద‌ని, దసరా నాటికి దానిని విడుదల చేయవచ్చని స‌మాచారం.

ముఖ్యంగా గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, చీరాల నుంచి కరణం వెంకటేశ్, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్, వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఇంకా వాసుపల్లి గణేశ్, మద్దాల గిరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన 7 సర్వేల ఆధారంగా సీట్లు ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ విషయంపై వైఎస్ జగన్‌దే తుది నిర్ణయం కానుంది. అదే సమయంలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు కూడా లెక్కలోకి తీసుకోనున్నారు.

తెలుగుదేశం-జనసేన పొత్తు దాదాపు ఖాయమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో వివిధ సమీకరణాలను అధ్యయనం చేసి అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తున్న‌ట్టు స‌మాచారం. తొలి జాబితాలో 27 మంది కొత్తవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. కొత్త అభ్య‌ర్థుల‌ను ముందుగా ప్ర‌క‌టించ‌డం ద్వారా నియోజ‌క‌వ‌ర్గంలో ఎదుర‌య్యే వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌వ‌చ్చ‌నేది పార్టీ వ్యూహంగా ఉంది.

2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిన నియోజకవర్గాల్లో ఇప్పటి వరకూ పార్టీ కో-ఆర్డినేటర్లుగా పనిచేసినవారిలో కొందరికి అభ్యర్థిత్వం ఖరారు చేయనున్నారు. అదే సమయంలో పార్టీపై తిరుగుబాటు చేసి దూరమైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గాల్లో ఇతరులకు తొలి జాబితాలోనే టికెట్లు ఇవ్వనున్నారు. దసరా నాటికి తొలి జాబితా విడుదల చేసి సంక్రాంతి తర్వాత తుది జాబితా విడుదల చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి.


Tags:    
Advertisement

Similar News