ప్రతిపక్ష హోదాకోసం జగన్ లేఖ..

ఈనెల 24న జగన్ ఆ లేఖ రాసినట్టు ఉండగా, ఈరోజు స్పీకర్ కార్యాలయం దాన్ని స్వీకరించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ లేఖ వ్యవహారం ఇప్పుడు బయటపడింది.

Advertisement
Update:2024-06-25 16:54 IST

175 స్థానాల ఏపీ అసెంబ్లీలో వైసీపీకి వచ్చిన సీట్లు 11. మొత్తం స్థానాల్లో 10శాతం సీట్లు వచ్చిన పార్టీకే ప్రతిపక్ష హోదా దక్కుతుందనే నిబంధన తెరపైకి వస్తే మాత్రం వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కదు. కానీ అలాంటి నిబంధనలేవీ లేవని, వైసీపీని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని కోరారు జగన్. ఈమేరకు ఆయన అసెంబ్లీ స్పీకర్ కి ఓ లేఖ రాశారు. ఈనెల 24న ఆ లేఖ రాసినట్టు ఉండగా, ఈరోజు స్పీకర్ కార్యాలయం దాన్ని స్వీకరించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ లేఖ వ్యవహారం ఇప్పుడు బయటపడింది.


ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా.. సంప్రదాయాలను మార్చేశారని జగన్ తన లేఖలో స్పీకర్ కు గుర్తు చేశారు. మొదట సభా నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతకు అవకాశం ఇస్తారని, వారిద్దరి తర్వాతే మంత్రులకు అవకాశం ఇస్తారన్నారు. కానీ అసెంబ్లీలో మంత్రుల తర్వాత తనను ప్రమాణ స్వీకారానికి పిలిచారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని గుర్తు చేశారు జగన్.

జగన్ చెప్పిన ఉదాహరణలు..

- 1984లో లోక్‌సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకున్నా, వారికి సభలో 10శాతం సీట్లు లేకపోయినా పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.

- 1994 ఉమ్మడి ఏపీ అసెంబ్లీ 294 సీట్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 26 సీట్లు మాత్రమే గెలుచుకున్నా, పి.జనార్దన్‌రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.

- 2015లో 70 స్థానాలకు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 3 సీట్లు సాధించినా కూడా బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించారు.

ఈ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి 40శాతానికి పైగా ఓట్లు వేశారని వారి తరపున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతోనే ఈ లేఖ రాస్తున్నాని పేర్కొన్నారు జగన్.

పాత వీడియో వైరల్..

జగన్ లేఖ ఇలా బయటకొచ్చిందో లేదో, అలా ఆయన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అప్పట్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. ఆ 23లో ఐదుగురిని ఇటువైపు లాగేసుకుంటే చంద్రబాబుకి 10శాతం సీట్లు ఉండవని, ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కదని తనకు కొంతమంది సలహా ఇచ్చారంటూ జగన్ అసెంబ్లీలోనే చెప్పారు. అప్పుడు టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కకూడదని అనుకున్న జగన్, ఇప్పుడు ఆ హోదాకోసం లేఖ ఎందురు రాశారని నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. 



Tags:    
Advertisement

Similar News