ఏపీలో ముఠాల పాలన
కేవలం 2 నెలల కాలంలోనే ఏపీలో ప్రతీకార దాడులు పెరిగిపోయాయని, ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందన్నారుల జగన్.
సేవ్ ఏపీ ఫ్రమ్ టీడీపీ అనే హ్యాష్ ట్యాగ్ జతచేస్తూ మాజీ సీఎం జగన్ ఓ సుదీర్ఘ ట్వీట్ వేశారు. ఏపీలో జరుగుతున్న దారుణాల బాధితులకు తాము అండగా ఉంటామని, తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన ఈ ట్వీట్ ద్వారా భరోసా ఇచ్చారు. ఏపీలో కొనసాగుతోంది కూటమి పాలన కాదని, ముఠాల పాలన అని విమర్శించారు జగన్.
ఏపీలో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనపడుతోందన్నారు జగన్. కేవలం 2 నెలల కాలంలోనే ఏపీలో ప్రతీకార దాడులు పెరిగిపోయాయని, ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందన్నారు. ఈ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు జగన్. ప్రభుత్వంలోని పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు నిత్యకృత్యం అయ్యాయని విమర్శించారు. అధికారంలో తమపార్టీయే ఉందన్న ధీమాతో కూటమి పార్టీల కార్యకర్తలు దాడులు చేస్తున్నారని, ఇవి రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు అని మండిపడ్డారు జగన్.
నంద్యాల జిల్లాలో జరిగిన హత్య, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన ఈ రాజకీయ ప్రతీకారాలకు తాజా నిదర్శనాలని అన్నారు జగన్. సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలు నిలబెట్టుకోలేక, ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు జగన్. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకూడదని, ప్రజలు రోడ్డుపైకి రాకూడదని.. అందర్నీ భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కానీ తాము వెనక్కి తగ్గేది లేదన్నారున. ప్రజలు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు జగన్.