ఏపీలో కొత్త‌గా 3 పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణ‌యం

మూడు కాలేజీల‌నూ వెనుక‌బడిన ప్రాంత‌మైన రాయ‌ల‌సీమకే కేటాయించిన‌ట్టు మంత్రి బుగ్గ‌న వెల్ల‌డించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు, నంద్యాల జిల్లా బేతంచెర్ల‌, అనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు.

Advertisement
Update:2023-03-21 11:40 IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్య‌కు అత్యంత ప్రాధాన్య‌మిస్తున్న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త‌గా 3 పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి సౌర‌బ్‌ గౌర్ ఈ మేర‌కు సోమ‌వారం దీనికి సంబంధించి గెజిట్ విడుద‌ల చేశారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

మూడు కాలేజీల‌నూ వెనుక‌బడిన ప్రాంత‌మైన రాయ‌ల‌సీమకే కేటాయించిన‌ట్టు మంత్రి బుగ్గ‌న వెల్ల‌డించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు, నంద్యాల జిల్లా బేతంచెర్ల‌, అనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు. రూ.100 కోట్ల వ్య‌యంతో పాలిటెక్నిక్ కాలేజీల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు చెప్పారు.

ఈ కాలేజీల్లో విద్య‌న‌భ్య‌సించే విద్యార్థుల‌కు ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌ర‌మైన వృత్తి నైపుణ్య శిక్షణ అందుతుంద‌ని వివ‌రించారు. త‌ద్వారా విద్య పూర్త‌వ‌గానే ఉపాధి అవ‌కాశాలు విరివిగా ల‌భిస్తాయ‌ని చెప్పారు.

ఈ కాలేజీలు అందుబాటులోకి వ‌స్తే.. మెకానిక‌ల్‌, ఎలక్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, సివిల్‌, కెమిక‌ల్‌, మెట‌ల‌ర్జిక‌ల్ విభాగాల్లో డిప్లొమా కోర్సుల కోసం సుదూర ప్రాంతాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం స్థానిక విద్యార్థుల‌కు ఉండ‌ద‌ని మంత్రి బుగ్గ‌న చెప్పారు. గ్రామీణ యువ‌త‌కు ఈ కాలేజీలు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయ‌ని వివ‌రించారు.

Tags:    
Advertisement

Similar News