లోపాల్లో జగన్‌కు బాధ్యత లేదా..?
జగన్ ప్రభుత్వం వెంటనే ఎదురుదాడికి దిగింది. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు గేట్లకు పట్టిన తుప్పును పట్టించుకోలేదని, ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేసిందని ఆరోపణలతో విరుచుకుపడుతోంది.
గడచిన నాలుగున్నరేళ్లలో జరిగిన చాలా తప్పులకు, బయటపడిన లోపాలకు చంద్రబాబును నిందించటం వైసీపీ ప్రభుత్వానికి ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడేమి జరిగినా అప్పట్లో చంద్రబాబు పట్టించుకోలేదు కాబట్టే ఇప్పుడిలా జరిగిందని మంత్రులు, జగన్ మీడియా పదేపదే వార్తలు, కథనాలు అచ్చేస్తోంది. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలిసినా.. అదే పంథాలో ముందుకు వెళ్తున్నారు. తప్పులకు, లోపాలకు పూర్తిగా చంద్రబాబునే బాధ్యుడిని చేసి చేతులు దులుపుకునే బాధ్యతా రాహిత్యమే కనబడుతోంది.
తాజాగా ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ రిజర్వాయర్ రెండోగేటు శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. భారీవర్షాలకు ఒక్కసారిగా వరదనీరు రిజర్వాయర్ లోకి వచ్చేసింది. ఆ నీటి ఉధృతిని తట్టుకోలేక రెండోగేటు ఊడిపోయింది. దాంతో ఊడిపోయిన గేటులో నుంచి నీరంతా బయటకు వెళ్ళిపోతోంది. వెంటనే జగన్ ప్రభుత్వం వైఫల్యమంటూ టీడీపీ గోలమొదలుపెట్టింది. ప్రతిపక్షమన్నాక ప్రతి విషయంలోనూ ప్రభుత్వంపై బురదచల్లాలనే చూస్తుంది. ఆ అవకాశాన్ని ప్రతిపక్షాలకు ప్రభుత్వం ఇవ్వకుండా జాగ్రత్తపడాలి.
ఆ పనిచేయని జగన్ ప్రభుత్వం వెంటనే ఎదురుదాడికి దిగింది. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు గేట్లకు పట్టిన తుప్పును పట్టించుకోలేదని, ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేసిందని ఆరోపణలతో విరుచుకుపడుతోంది. అయితే ఇలాంటి ఎదురుదాడితో ఎలాంటి ఉపయోగం లేదని ప్రభుత్వానికి అర్థంకావటంలేదు. ఎందుకంటే.. జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఇలాంటి ఎదురుదాడి చేస్తే చెల్లుతుంది. అంతేకానీ నాలుగున్నరేళ్ళుగా అధికారంలో ఉండికూడా ఇలాంటి ఆరోపణలు చేయటానికి సిగ్గుపడాలి. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేసింది నిజమే అనుకుందాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం ఏమిచేసింది.
ప్రాజెక్టు గేట్లకు పట్టిన తుప్పును వదిలించి, సక్రమంగా నిర్వహించుండచ్చు కదా..? ఆ పనెందుకు చేయలేదు..? తన హయాంలో జరగాల్సిన పనులకు కూడా అంతకుముందు పట్టించుకోని చంద్రబాబునే నిందిస్తే ఉపయోగం ఏమిటి..? తన సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో కూడా జగన్ ప్రభుత్వం ఇలాగే చేసింది. జరిగిన తప్పును ఒప్పుకుని మళ్ళీ అదే తప్పు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గడచిన నాలున్నరేళ్ళల్లో జగన్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణకు ఏమి చర్యలు తీసుకున్నది అన్నది పాయింట్. అంతేకానీ 365 రోజులూ చంద్రబాబునే నిందిస్తూ కూర్చుంటే ఎలాంటి ఉపయోగముండదు. కాబట్టి బయటపడుతున్న లోపాలకు జగన్ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సిందే.