కియా క్రెడిట్ మాదే.. జగన్, బాబు పోటా పోటీ ట్వీట్లు
కియా గురించి జగన్ ట్వీట్ వేసిన గంటల వ్యవధిలోనే చంద్రబాబు కూడా ట్వీట్ వేశారు. కియాను అభినందిస్తూ, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతపురంలో ఏర్పాటు చేసిన కియా కంపెనీ 10 లక్షల కార్లు తయారు చేసిన సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున సీఎం జగన్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ వేశారు. నాలుగేళ్ల తక్కువ వ్యవధిలోనే మిలియన్ టార్గెట్ ని కియా చేరుకుందని ఆయన అభినందనలు తెలిపారు. కియా అందుకున్న ఈ మైలురాయి ఆంధ్రప్రదేశ్ ను ఆటోమొబైల్ పరిశ్రమకు అనుకూలమైన గమ్యస్థానంగా మార్చిందన్నారు. ముందు ముందు కియా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
అయితే కియా గురించి జగన్ ట్వీట్ వేసిన గంటల వ్యవధిలోనే చంద్రబాబు కూడా ట్వీట్ వేశారు. కియాను అభినందిస్తూ, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. 2017లో తమ హయాంలో కియా పరిశ్రమ వచ్చిందని గుర్తు చేశారు బాబు. సంపద సృష్టించడంలో భాగంగా కియాను ఏపీకి తెచ్చామన్నారు. ఈరోజు రాయలసీమ ప్రాంతం కియా ద్వారా ఉపాధి అవకశాలు పొందుతుందంటే దానికి కారణం తానేనని చెప్పుకొచ్చారు బాబు. మొత్తమ్మీద కియా గొప్పతనమంతా తమదేనంటున్నారు బాబు.
కియా తప్ప ఇంకేమీ లేదా..?
కియా పరిశ్రమ విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య ఇప్పటికే చాలాసార్లు మాటల యుద్ధం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కియాని వ్యతిరేకించిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక అది తమ గొప్పగా చెప్పుకుంటోందని టీడీపీ నేతలు విమర్శించేవారు. అసలు కియా ఉత్పత్తి తమ హయాంలోనే మొదలైందని అంటారు వైసీపీ నేతలు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఇరు పార్టీలు పోటీ పడటానికి కియా మినహా గత 9 ఏళ్లలో మరో కంపెనీ లేకపోవడం విశేషం.