జగన్ టార్గెట్ @ 21

వైనాట్ 175 అనేది ప్రస్తుతానికి టార్గెట్ మాత్రమే. ఫలితం ఎలాగుంటుందో ఇప్పుడే ఎవరు చెప్పలేరు. బహుశా జగన్‌కు కూడా తెలిసే ఉంటుంది అది సాధ్యంకాదని. కాకపోతే కుప్పంలో చంద్రబాబు నాయుడును ఓడిస్తే చాలు మొత్తం 175 నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించినట్లే అనే మనసులో అనుకుంటున్నట్లున్నారు.

Advertisement
Update:2023-04-16 11:53 IST

వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నినాదం వైనాట్ 175 అనేది ఎంతవరకు వర్క‌వుట్‌ అవుతుందో తెలియ‌దు. ప్రస్తుతానికి అది టార్గెట్ మాత్రమే. ఫలితం ఎలాగుంటుందో ఇప్పుడే ఎవరు చెప్పలేరు. బహుశా జగన్‌కు కూడా తెలిసే ఉంటుంది అది సాధ్యంకాదని. కాకపోతే కుప్పంలో చంద్రబాబు నాయుడును ఓడిస్తే చాలు మొత్తం 175 నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించినట్లే అనే మనసులో అనుకుంటున్నట్లున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించగలిగితే 175కి 175 సీట్లు గెలవలేమా అని చాలాసార్లు జగన్ అడిగిన విషయం తెలిసిందే.

అయితే 175 నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించటం అంత తేలిక కాదు. ఎందుకంటే వైసీపీ ఏర్పాటైన దగ్గర నుండి గెలుపు అందకుండా ఊరిస్తున్న నియోజకవర్గాలు 21 ఉన్నాయి. వైసీపీ ఏర్పడిన దగ్గర నుండి కొన్ని బై ఎలక్షన్స్+ 2 జనరల్ ఎలక్షన్స్ ను ఎదుర్కొన్నది. మొత్తంమీద చూస్తే మొన్నటి ఎన్నికల్లో 151 చోట్ల గెలిచింది. 23 నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల అభ్యర్థులు వీక్‌గా ఉండటమో లేక టీడీపీ చాలా బలంగా ఉన్న కారణంగానో వైసీపీ ఒడిపోయింది.

గెలుపు అందకుండా ఊరిస్తున్న నియోజకవర్గాలు రాయలసీమలో కుప్పం, హిందుపురం ఉన్నాయి. వీటిల్లో పార్టీ పెట్టిన దగ్గర నుండి ఇప్పటివరకు ఒక్కసారి కూడా హిందుపురంలో టీడీపీ ఓడిందిలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల, పర్చూరు, కొండెపిలో గెలవలేదు. అలాగే గుంటూరు-2లో ఎంత ప్రయత్నించినా గెలుపు దక్కలేదు. కృష్ణా జిల్లాలోని గన్నవరం, విజయవాడ తూర్పులో కూడా వైసీపీ గెలవలేదు. పశ్చిమ గోదావరిలో పాలకొల్లు, ఉండి, తూర్పు గోదావరిలో రాజమండ్రి అర్బన్, రూరల్, మండపేట, పెద్దాపురం, రాజోలులో గెలుపున‌కు దూరంగానే ఉండిపోతోంది.

ఇక విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలు, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, టెక్కలిలో కూడా వైసీపీకి విజయం దక్కటంలేదు. కాబట్టి ఈ నియోజకవర్గాల్లో జగన్ బలమైన అభ్యర్థుల‌ను పోటీకి దింపి గెలుచుకోగలిగితేనే 175 గురించి ఆలోచించాలి. ఇదే సమయంలో చేతిలో ఉన్న నియోజకవర్గాల్లో పోయేవి ఎన్నో కూడా చూసుకోవాలి కదా. మొత్తంమీద తేలేదేమంటే జగన్ అనుకుంటున్నట్లు 175కి 175 గెలుపు సాధ్యంకాదు, ప్రజాస్వామ్యానికి అది మంచిది కూడా కాదు.

Tags:    
Advertisement

Similar News