వైఎస్సార్ సీపీని ఓడించడం కష్టమే.. లావు కృష్ణదేవరాయలు
బీజేపీ తమతో కలిసిందని, దానివల్ల అదనంగా ప్రయోజనం కలిగేది ఏమీ లేదని ఆయన అన్నారు. లావు కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ తనకు అనుకూలంగా మలుచుకుంది.
వైఎస్సార్ సీపీని వదిలేసి టీడీపీలో చేరిన నర్సాపురం ఎంపీ లావు కృష్ణదేవరాయలుకు రాజకీయాల అసలు మర్మం అర్థమైనట్లుంది. లావు కృష్ణదేవరాయలు సీటు మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూశారు. అది ఆయనకు నచ్చలేదు. నర్సాపురం నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టి కూర్చుకున్నారు. ఆయన ఒత్తిడికి జగన్ తలొగ్గలేదు. దాంతో ఆయన వైఎస్సార్ సీపీని వీడి టీడీపీలో చేరి నర్సాపురం నుంచి పోటీ చేస్తున్నారు.
రాష్ట్రంలో వైఎస్సార్ సీపీని ఓడించడం చాలా కష్టమని, అందుకు చాలా శ్రమపడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనసేన, టీడీపీ కూటమి బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనం కూడా ఏమీ లేదని ఆయన అన్నారు.
బీజేపీ తమతో కలిసిందని, దానివల్ల అదనంగా ప్రయోజనం కలిగేది ఏమీ లేదని ఆయన అన్నారు. లావు కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ తనకు అనుకూలంగా మలుచుకుంది. ఎన్నికలు ప్రారంభం కాకుండానే టీడీపీ తన పరాజయాన్ని అంగీకరించిందని వైఎస్సార్ సీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ కోసం పనిచేస్తున్న ఐ-ప్యాక్ ఆయన వ్యాఖ్యలను తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం సాగిస్తోంది
ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం టీడీపీలో కొరవడిందని, పోరాటం చేయకుండానే టీడీపీ అభ్యర్థులు చేతులెత్తేస్తున్నారని వ్యాఖ్యానించింది. నిజానికి, మొదట్లో వైఎస్సార్ సీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించదనే అభిప్రాయం వ్యక్తమైంది. జగన్ సిద్ధం సభల ప్రారంభంతో వాతావరణం మారుతూ వచ్చింది. క్రమంగా వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందనే వాతావరణం ఏర్పడింది.