టీడీపీ కంచుకోట‌లు కూలాయి.. ఐదేళ్ల‌యినా ఆత్మ‌విమ‌ర్శ చేసుకోరా అంటున్న క్యాడ‌ర్

మ‌న‌వే అనుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయామో అనే స‌మీక్ష లేకుండానే ఐదేళ్లు గ‌డిచిపోయాయ‌ని, ఇలాగే ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ నిరాశ త‌ప్ప‌ద‌ని క్యాడ‌ర్ బాధ‌ప‌డుతోంది.

Advertisement
Update:2023-11-12 08:19 IST

1983లో అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నాలుగు దశాబ్దాలుగా టీడీపీ అధికారం చేజిక్కుంచుకున్నా లేక ఓడిపోయి ప్ర‌తిప‌క్షంలో కూర్చున్నా ఆ పార్టీకి కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అక్క‌డ‌ మాత్రం గెలుపు ఖాయ‌మ‌ని సైకిల్ పార్టీ క్యాడ‌ర్ బ‌లంగా భావించే నియోజ‌క‌వ‌ర్గాలివి. అలాంటి కంచుకోటలూ 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ ఫ్యాన్ గాలికి కుప్పకూలిపోయాయి. అది జ‌రిగి ఐదేళ్ల కావొస్తుంది. కానీ, ఇప్ప‌టికీ దానిమీద ఆత్మ‌విమ‌ర్శ చేసుకోక‌పోవ‌డంపై టీడీపీ క్యాడ‌ర్ ఆవేద‌న చెందుతోంది. మ‌న‌వే అనుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయామో అనే స‌మీక్ష లేకుండానే ఐదేళ్లు గ‌డిచిపోయాయ‌ని, ఇలాగే ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ నిరాశ త‌ప్ప‌ద‌ని క్యాడ‌ర్ బాధ‌ప‌డుతోంది.

ప‌లాస నుంచి నందిగామ వ‌ర‌కు

శ్రీకాకుళం జిల్లా పలాసలో (గతంలో ఇది సోంపేట నియోజ‌క‌వ‌ర్గంలో) 2009లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచింది. కానీ, 2019లో గౌతు శిరీష ఓడిపోయారు. ఇక విజ‌య‌న‌గ‌రంలో 2004లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌వాలో త‌ప్ప అన్నిసార్లూ టీడీపీయే గెలిచింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతి రాజు కుమార్తె అదితి గజపతి రాజును రంగంలోకి దింపితే ఓట‌మి ఎదుర‌యింది. ఇక పాయకరావుపేటలో టీడీపీ 8 ఎన్నికల్లో ఏకంగా ఏడుసార్లు గెలిచింది. 2019లో వైసీపీ అభ్య‌ర్థి గొల్ల బాబూరావు టీడీపీ అభ్య‌ర్థిపై ఏకంగా 31వేల భారీ మెజార్టీతో గెలిచారు. ఏడుసార్లు గెలిచిన కృష్ణా జిల్లా నందిగామలోనూ గ‌త ఎన్నిక‌ల్లో సైకిల్ స్టాండ్ వేయ‌లేక కిందప‌డింది.

కొవ్వూరులోనూ ఓడిపోయారు

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు (ఇప్పుడు తూర్పుగోదావ‌రి జిల్లాలోకి వ‌చ్చింది)లో టీడీపీదే హ‌వా. టీడీపీ సీనియ‌ర్ నేత పెండ్యాల కృష్ణ‌బాబు వ‌ర్గం గెలుపు ఓట‌ముల‌ను నిర్దేశించేది. ఏడుసార్లు ఇక్క‌డ టీడీపీయే గెలిస్తే అందులో కృష్ణ‌బాబు ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. పున‌ర్విభ‌జ‌న‌లో కొవ్వూరు ఎస్సీ అయ్యాక కూడా టీడీపీ రెండుసార్లు గెలిచింది. 2019లో మాత్రం వైసీపీ అభ్య‌ర్థి తానేటి వ‌నిత (ప్ర‌స్తుత హోం మినిస్ట‌ర్‌) చేతిలో టీడీపీ అభ్య‌ర్థి వంగలపూడి అనిత 25,248 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1989లో తప్ప అన్ని ఎన్నికల్లోనూ గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ గెలిచింది. కానీ 2019లో బోర్లా ప‌డింది.

ఓట‌మి స‌రే.. స‌మీక్షించుకోలేరా..?

ఇలా చెప్పుకుంటే పోతే టీడీపీ కంచుకోట‌లెన్నో గ‌త ఎన్నిక‌ల్లో కూలిపోయాయి. పార్టీ ఆవిర్భావం తర్వాత గత 36 ఏళ్లలో జరిగిన 8 ఎన్నికల్లో టీడీపీ ఏడుసార్లు గెలిచిన 16 నియోజకవర్గాల్లో, ఆరుసార్లు గెలిచినవి 29 చోట్ల గ‌త ఎన్నిక‌ల్లో బొక్క‌బోర్లా ప‌డింది. ఓట‌మి ఎలా ఉన్నా దానికి కార‌ణాలేమిటో, అందులో నాయ‌కుల పాత్ర ఏమిటో క‌నీసం టీడీపీ స‌మీక్షించ‌లేద‌ని ఆ పార్టీ క్యాడ‌ర్ ఆవేద‌న‌. మ‌ళ్లీ ఎన్నిక‌లొస్తున్నా ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి టీడీపీకి అనుకూలంగా లేద‌ని.. ఆ పార్టీ వ‌ర్గాలే అంచ‌నా వేస్తున్నాయి. ఓట‌మి నుంచి గుణ‌పాఠాలు నేర్చుకోకుండా అలాగే ముందుకెళ్ల‌డంపై ఆవేద‌న ప్ర‌క‌టిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News