అశ్వనీదత్ మంట ఇదేనా..?
సినీ పరిశ్రమకు సంబంధించి ఎన్ని సమస్యలున్నా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏరోజూ నోరు విప్పని దత్ ఇప్పుడు మాత్రం రెచ్చిపోతున్నారు.
ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ గడచిన నాలుగేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతూనే ఉన్నారు. అవకాశం దొరికినప్పుడే కాదు దొరికించుకుని మరీ రెచ్చిపోతున్నారు. తాజాగా ప్రభుత్వం నంది అవార్డులను ఇవ్వకపోవటంపై ఘట్టమనేని ఆదిశేషగిరిరావు రెండుప్రభుత్వాల పైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పక్కనే కూర్చున్న దత్ మాట్లాడుతూ.. ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అనే అవార్డులు అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో జగన్ ప్రభుత్వంపై అశ్వనీదత్ విరుచుకుపడుతూనే ఉన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించి ఎన్ని సమస్యలున్నా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏరోజూ నోరు విప్పని దత్ ఇప్పుడు మాత్రం రెచ్చిపోతున్నారు. ఇంతకీ దత్ అసలు సమస్య ఏమిటా అని ఆరాతీస్తే.. టీడీపీ వర్గాల సమాచారం ఏమిటంటే.. అమరావతి రాజధాని ప్రాంతంలో దత్ భూముల విలువ బాగా పడిపోయాయట.
నిజానికి దత్ కు అమరావతి ప్రాంతంలో ఎలాంటి భూములు లేవు. అయితే గన్నవరం విమానాశ్రయం విస్తరణకు రైతులు భూములిచ్చారు. ఆ రైతుల్లో దత్ కూడా ఉన్నారట. రైతులకు ఆ చుట్టుపక్కలే ప్రత్యామ్నాయంగా భూములు ఇచ్చేశారు. కానీ దత్ దగ్గర నుండి 39 ఎకరాలు తీసుకున్నందుకు గన్నవరం ప్రాంతంలో కాకుండా అమరావతి ప్రాంతంలో భూమిచ్చారట. ఎకరాకు వెయ్యిగజాల చొప్పున దత్ కు అమరావతి ప్రాంతంలో 39 వేల గజాల స్థలాన్ని చంద్రబాబు కేటాయించారట. ఆ స్థలాన్ని కమర్షియల్ గా డెవలప్ చేసేందుకు దత్ భారీ ప్రణాళికలు రెడీ చేసుకున్నారట.
2019 ఎన్నికలు కాగానే తన ప్రణాళికలను అమల్లోకి తెచ్చేందుకు దత్ రెడీ అయ్యారని సమాచారం. అయితే ఊహించని రీతిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. తర్వాత జరిగిన పరిణామాల్లో మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదకొచ్చింది. అమరావతి భూముల విలువ దారుణంగా పడిపోయింది. దాంతో దత్ కమర్షియల్ ప్రణాళికలన్నీ తలకిందులైపోయాయట. తర్వాత ఇదే విషయమై దత్ కోర్టులో కేసు వేసినా ఏమీ తేలలేదు. అప్పటినుండి జగన్ అంటేనే అశ్వనీదత్ మండిపోతున్నారు. నేరుగా జగన్‌ను ఏమీ చేయలేని దత్ ఎల్లోమీడియా ముందు తనలోని మంటను కక్కేస్తుంటారు.