ఉత్తరాంధ్ర అభివృద్ధి స్పీడందుకుంటోందా..?
తొందరలోనే విశాఖపట్నం, విజయనగరం మధ్యలో ఉన్న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమనాశ్రయానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు.
తొందరలోనే విశాఖపట్నం నుండి పరిపాలన సాగించాలని ప్రయత్నాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దూకుడు పెంచారు. ఈనెల 19వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. జిల్లా అభివృద్ధి జరగాలంటే భావనపాడు పోర్టు నిర్మాణం జరగాలని దశాబ్దాలుగా డిమాండ్లు వినబడుతూనే ఉన్నాయి. అయితే ఏ ప్రభుత్వమూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అలాంటిది జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయమై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.
ఇందులో భాగంగానే పోర్టు నిర్మాణానికి అవసరమైన 250 ఎకరాలను రైతుల నుండి ప్రభుత్వం సేకరించింది. రైతులకు మెరుగైన ప్యాకేజీని అందించటంతో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అందుకనే భూసేకరణలో ఎలాంటి సమస్యలు రాలేదు. ఈ పోర్టు పూర్తయితే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం పోర్టు తర్వాత భావనపాడు పోర్టు చాలా కీలకమవుతుంది. శంకుస్థాపన చేస్తున్నారు కాబట్టి వెంటనే నిర్మాణం కూడా మొదలవ్వబోతోంది.
ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే తొందరలోనే విశాఖపట్నం, విజయనగరం మధ్యలో ఉన్న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమనాశ్రయానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. దీని నిర్మాణానికి కూడా అవసరమైన భూసేకరణ పూర్తయిపోయింది. చంద్రబాబునాయుడు హయాంలోనే భూసమీకరణ ప్రక్రియ మొదలైనా గొడవల కారణంగా నిలిచిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యను సెటిల్ చేశారు. ఇదికాకుండా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్న ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారం కాబోతోంది. ఫ్లోరైడ్ సమస్య ఉన్న 800 గ్రామాల పరిధిలో మంచినీటి సౌకర్యాన్ని జగన్ ఏర్పాటు చేస్తున్నారు.
ఇందుకోసం వంశధార నది నుండి పైప్ లైన్లు వేస్తున్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి ప్రతి ఇంటికి కొళాయి ద్వారా మంచినీటి సరఫరా ఏర్పాట్లు జరుగుతోంది. ఓవర్ హెడ్ ట్యాంకులు, ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం కూడా జరుగుతోంది. దీనికి అదనంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తవ్వబోతోంది. విజయనగరంలో మెడికల్ కాలేజీ+గిరిజన యూనివర్సిటీ రాబోతున్నాయి. మొత్తంమీద ఉత్తరాంధ్రపై జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు దీంతో అర్థమవుతోంది. అన్నీ పూర్తయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ఖాయం.