చంద్రబాబుతో జత కట్టి పవన్‌ మంచి ఛాన్స్‌ మిస్సవుతున్నాడా..?

పవన్‌ కల్యాణ్‌కు చెందిన జనసేనకు 125 ఎమ్యెల్యే సీట్లు, 10 ఎంపీ సీట్లు ఇవ్వాలని, పవన్‌ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు పెట్టాలని బీజేపీ భావించింది.

Advertisement
Update:2024-02-07 15:55 IST

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో జతకట్టి పవన్‌ కల్యాణ్‌ మంచి ఛాన్స్‌ మిస్సవుతున్నారని అనిపిస్తోంది. టీడీపీని పక్కన పెట్టేసి జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్లాన్‌ గురించి వివరిస్తూ అది తనకు ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారమంటూ ఓ పొలిటికల్‌ క్రిటిక్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ఆ పొలిటికల్‌ క్రిటిక్‌ కథనం ప్రకారం.. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీని వెనక్కి నెట్టి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ప్రధాన పోటీదారుగా జనసేనతో కలిసి తమ పార్టీని నిలబెట్టాలని బీజేపీ నాయకులు ప్లాన్‌ చేశారు అందుకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను బీజేపీ నేతలు పవన్‌ కల్యాణ్‌కు కూడా చేరవేశారు. పవన్‌ కల్యాణ్‌కు చెందిన జనసేనకు 125 ఎమ్యెల్యే సీట్లు, 10 ఎంపీ సీట్లు ఇవ్వాలని, పవన్‌ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు పెట్టాలని బీజేపీ భావించింది. రైల్వే జోన్‌, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌, చిరంజీవికి రాజ్యసభ సీటు హామీలను కూడా పవన్‌ కల్యాణ్‌కు ఇచ్చింది.

అయితే, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్‌ కల్యాణ్ బీజేపీపై ఒత్తిడి పెంచుతూ వచ్చారు. అందుకు కొంత మేరకు బీజేపీని ఒప్పించారు కూడా. దీంతో టీడీపీని బీజేపీ ఎన్డీఏలోకి ఆహ్వానించే అవకాశాలున్నాయి.

ఈ స్థితిలో పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు కోసం మంచి అవకాశాన్ని వదులుకోవడానికి సిద్దపడ్డారని భావించవచ్చు. తమ పార్టీ, జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా.. ప్రధాన ప్రతిపక్షంగానైనా అవతరించే అవకాశాలున్నాయని బీజేపీ నాయకులు అంచనాలు వేసుకున్నారు. తద్వారా చంద్రబాబును మూడో స్థానంలోకి నెట్టాలని బీజేపీ అనుకుంది.

Tags:    
Advertisement

Similar News