ఓటమి భయంతో పవన్ పారిపోతున్నారా..?
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం భీమవరం నాయకులతో తీవ్ర మేథోమధనం చేశారు.
గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గం వదిలి వేరేచోట పోటీకి వెళ్లడం ఖాయమైపోయింది. అభ్యర్థి ఎవరైనా సరే భీమవరంలో జనసేన గెలవాల్సిందేనన్న పవన్ వ్యాఖ్యలు తాను ఇక్కడ పోటీ చేయడం లేదని తేల్చిచెప్పేసినట్లయింది. మరోవైపు త్వరలోనే జనసేనలో చేరతానని, గత ఎన్నికల్లో పవన్ మీద టీడీపీ నుంచి పోటీ చేసిన పులవర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రకటించారు. దీంతో అంజిబాబే భీమవరం జనసేన క్యాండేట్ అని రూఢీ అవుతోంది.
చివరి చర్చలేనా?
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం భీమవరం నాయకులతో తీవ్ర మేథోమధనం చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ కనకరాజు సూరి, జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి చినబాబు తదితరులతో సమావేశమై భీమవరంలో రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. అక్కడ పరిస్థితులు తనకు ఆశాజనకంగా లేవని, మళ్లీ ఓడిపోతే తలెత్తుకోలేమన్న ఆందోళనలో ఉన్న జనసేనాని ఈసారి వేరే నియోజకవర్గానికి వెళదామనుకుంటున్నానని వాళ్లతో తేల్చిచెప్పేసినట్లు సమాచారం. అందుకే అభ్యర్థి ఎవరయినా భీమవరంలో జనసేన గెలవాలని ఆయన వ్యాఖ్యానించారు.
జనసేనలో చేరుతున్నానని చెప్పిన అంజిబాబు
మరోవైపు రెండుసార్లు భీమవరంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పులవర్తి రామాంజనేయులు (అంజిబాబు) జనసేనలో చేరుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయన కిందటి వారం పవన్‌తో సమావేశమయ్యారు. తాజాగా గురువారం భీమవరం జనసేన నాయకులతో కలిసి వచ్చి పవన్‌తో భేటీలో పాల్గొన్నారు. రెండు, మూడు రోజుల్లో జనసేనలో చేరుతున్నానని ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ జనసేనలో అభ్యర్థి మార్పు ఖాయమని తేల్చేస్తున్నాయి. తానే గెలవలేనని పారిపోతున్న చోట వేరే అభ్యర్థి ఎలా గెలుస్తారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ మొదలయింది.