వీళ్ళ ఫెయిల్యూర్లే బీఆర్ఎస్ అడ్వాంటేజా?
మూడు రోజుల క్రితం తోట చంద్రశేఖర్ వైజాగ్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఉత్తరాంధ్రలో పాగా వేయటానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ ప్రయోగించబోతోంది.
రాష్ట్ర విభజనకు కారకుడైన కేసీఆర్ ఏపీలో కూడా అడుగుపెడుతున్నారంటే సాహసం చేస్తున్నట్లే లెక్క. విభజన సమయంలో కేసీఆర్ ఆంధ్రోళ్లు అంటూ ఎన్నేసి మాటలన్నారో, ఎన్ని తిట్లు తిట్టారో అందరికీ గుర్తుంది. అలాంటిది ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీ బీఆర్ఎస్‌గా మార్చారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందో వెంటనే ఏపీలో అడుగుపెట్టే విషయమై కేసీఆర్ ప్రణాళికలు మొదలుపెట్టారు. ఏపీ శాఖకు అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించారు. తోట ద్వారా ఏపీలో వ్యవహారాలను నడుపుతున్నారు.
ఇంతకీ ఏ ధైర్యంతో కేసీఆర్ ఏపీలో అడుగుపెడదామని అనుకుంటున్నారు? ధైర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్లే. ఏపీ ప్రయోజనాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తున్నా ఇద్దరూ పల్లెత్తు మాటకూడా అనలేకపోతున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇద్దరు ఏపీకి మోడీ చేస్తున్న అన్యాయాన్ని నిలదీయలేకపోతున్నారు. అడ్డుగోలు విభజన వల్ల జరిగిన నష్టం ఒక ఎత్తయితే చంద్రబాబు వల్ల జరిగిన, జగన్ వల్ల జరుగుతున్న నష్టం మరో ఎత్తు.
వీళ్ళిద్దరి వైఫల్యాలనే కేసీఆర్ అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని ప్లాన్ చేశారు. మూడురోజుల క్రితం తోట వైజాగ్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఉత్తరాంధ్రలో పాగా వేయటానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ ప్రయోగించబోతోంది. విశాఖపట్నం ప్రత్యేక రైల్వేజోన్ హామీని తుంగలో తొక్కేశారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులను ఆపేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా మోడీ ఇబ్బందిపెడుతున్నారు.
రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్రకు మోడీ ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తున్నా చంద్రబాబు, జగన్ నోరెత్తలేకపోతున్నారు. ఇలాంటి అంశాలనే బీఆర్ఎస్ ప్రధాన అస్త్రాలుగా చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. కళ్ళ ముందు వీళ్ళద్దరి వైఫల్యాలు కనబడుతుంటే ఇంకెవరైనా మోడీ ప్రభుత్వం మీద యుద్ధం చేద్దామని ధైర్యంగా వస్తే జనాలు ఎందుకు మద్దతుగా నిలబడకుండా ఉంటారు? కాబట్టి కేసీఆర్ నిదానంగా చాప కింద నీరులాగ తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.