షర్మిల జగన్‌ను టార్గెట్‌ చేయడం సరైందేనా..?

ప్రతిపక్షంలో ఉన్న‌ప్పుడు ప్రత్యేక హోదా కోసం జగన్‌ పోరాటం చేసిన విషయం వాస్తవమే. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సందర్భం వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతూనే ఉన్నారు.

Advertisement
Update:2024-02-07 17:06 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. హోదా విషయంలో గ‌తంలో జరిగిన పరిణామాలను అర్థం చేసుకోకుండా ఆమె జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని కేంద్రం పలుమార్లు స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అధ్యాయం ముగియడానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబే.

తన ప్రభుత్వ హయాంలో బీజేపీ చేతిలో చేయి వేసి నడిచారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అప్పటి బీజేపీ ప్రభుత్వం చెబితే.. వెనకా ముందు ఆలోచించకుండా చంద్రబాబు అందుకు అంగీకరించారు. హోదా కంటే ప్యాకేజీ వల్లే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఆయన అప్పట్లో ఊద‌ర‌గొట్టారు. దాంతోనే ప్రత్యేక హోదా అధ్యాయం ముగిసింది.

ప్రతిపక్షంలో ఉన్న‌ప్పుడు ప్రత్యేక హోదా కోసం జగన్‌ పోరాటం చేసిన విషయం వాస్తవమే. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సందర్భం వచ్చినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతూనే ఉన్నారు. అయితే, కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. దాంతో ఏ విధమైన ఆందోళనలకు, ఒత్తిళ్లకు బీజేపీ దిగివచ్చే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ లోక్‌సభ స్థానాలను వైసీపీ గెలుచుకున్నప్పటికీ ఏం చేసినా ప్రత్యేక హోదాను సాధించే పరిస్థితి లేదు. కేంద్రంతో సఖ్యత‌తో లేకపోతే రాష్ట్రానికి వచ్చేది కూడా రాని పరిస్థితులు ఎదురు కావచ్చు. అయినా మోడీని క‌లిసిన స‌మ‌యాల్లో హోదా గురించి ప్ర‌స్తావిస్తూనే ఉన్నారు జ‌గ‌న్‌. అందువ‌ల్ల‌ ప్రత్యేక హోదాపై షర్మిల జగన్‌ను నిందించడంలో అర్థం లేదు.

మరోటి... రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక హోదాపై గానీ విభజన చట్టం హామీలపై గానీ ఏకతాటి మీదికి వచ్చే పరిస్థితి లేదు. వైఎస్‌ జగన్‌ను ఏకపక్షంగా విమర్శించడమే తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు ప్రతిపక్షాలు కలిసి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనకు ఇష్టమైన విధంగా షర్మిల మాట్లాడితే మాట్లాడవచ్చు గానీ ఆ మాటలు అర్థవంతమైనవి కావని ప్రజలే గుర్తిస్తారు.

Tags:    
Advertisement

Similar News