బాబు హామీలకు, బడ్జెట్‌కి సంబంధం ఉందా?.. - వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల
ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్నవారే చేయగలిగిన హామీలు ఇస్తారని, అమలు చేసేవారెవరూ అడ్డగోలు హామీలు ఇవ్వరని సజ్జల ఈ సందర్భంగా చెప్పారు.
ఎగ్గొట్టడానికే చంద్రబాబు నాయుడు అడ్డగోలు హామీలు ఇస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాలకు మేలు జరిగిందని చెప్పారు. ఈ పథకాలతో రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా? అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పథకాలు తెస్తానని ఎలా చెబుతున్నారని సజ్జల ప్రశ్నించారు. బాబు హామీలకు, రాష్ట్ర బడ్జెట్‌కి అసలు సంబంధం ఉందా అని ఆయన నిలదీశారు. ఏటా రూ.70 వేల కోట్లతో జగన్ తన సంక్షేమాన్ని అమలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఏకంగా లక్షన్నర కోట్లు చేస్తానంటూ మాట్లాడుతున్నారని చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సజ్జల పై వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్నవారే చేయగలిగిన హామీలు ఇస్తారని, అమలు చేసేవారెవరూ అడ్డగోలు హామీలు ఇవ్వరని సజ్జల ఈ సందర్భంగా చెప్పారు. తమ మేనిఫెస్టో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేదిలా ఉండదని, ప్రజలకు ఏం చేస్తామో అదే చెప్పామని ఆయన తెలిపారు. మేనిఫెస్టో అంటే విశ్వసనీయత ఉండాలని, మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ అంటున్నారని, ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే అలా అడగగలరని చెప్పారు. అలా చంద్రబాబు ఎందుకు ఓటు అడగలేకపోతున్నారని సజ్జల ప్రశ్నించారు.
వలంటీర్ల వ్యవస్థ చంద్రబాబు వల్లే ఆగిపోయిందని సజ్జల చెప్పారు. పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలిగించారని మండిపడ్డారు. జనంలో వ్యతిరేకత రావడాన్ని గమనించి.. అది ఎన్నికల్లో నష్టం చేస్తుందనే భయంతోనే ఇప్పుడు మళ్లీ ఇంటింటికీ ఉద్యోగులను పంపించి పెన్షన్లు ఇవ్వమంటున్నారని తెలిపారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఉన్న వ్యవస్థలన్నీ నాశనం అవుతాయని చెప్పారు. జన్మభూమి కమిటీలు మళ్లీ వస్తాయన్నారు. చంద్రబాబు తన పాలనలో ఏం చేశారో ఇప్పటికీ ఎందుకు చెప్పలేకపోతున్నారని సజ్జల నిలదీశారు.