రాజకీయాల్లో రాయుడు టీ20 ఆడుతున్నాడా..?
ఏకంగా మూడు గంటలపాటు పవన్ తో భేటీ అయిన రాయుడు ఏమి చర్చించుంటాడు..? గుంటూరు ఎంపీగా లేదా పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ కావాలని అడిగినట్లు ప్రచారం జరుగుతోంది.
క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లో టీ-20 ఆడుతున్నట్లున్నారు. క్రికెట్లో పెద్దగా రాణించలేకపోయిన రాయుడుకి రాజకీయాలు మాత్రం బాగానే వంటిపట్టినట్లున్నాయి. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రాయుడు కొంతకాలం గ్యాప్ తీసుకుని వైసీపీలో చేరాడు. పార్టీలో చేరిన పదిరోజుల్లోపే రాజీనామా చేసేశాడు. రాయుడు రాజీనామాతో చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా జగన్ పైన విపరీతంగా బురదచల్లేశాయి.
జగన్ వేధింపులను తట్టుకోలేకే రాయుడు వైసీపీని వదిలేసినట్లు ఆరోపణలు గుప్పించారు. అప్పటికేదో రాయుడు దశాబ్దాలుగా రాజకీయాల్లోనే ఉంటున్నట్లుగా ఎల్లోమీడియా రాయుడును ఆకాశానికి ఎత్తేసింది. కొంతకాలం తర్వాత తన భవిష్యత్తును ప్రకటిస్తానని ప్రకటించిన రాయుడు సడెన్ గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వైసీపీకి రాజీనామా చేసినప్పుడు కొంతకాలం తర్వాత భవిష్యత్తును ప్రకటిస్తానని చెప్పాడు. అయితే నాలుగురోజులు కూడా కాకుండానే పవన్ తో భేటీ అయ్యాడు.
ఏకంగా మూడు గంటలపాటు పవన్ తో భేటీ అయిన రాయుడు ఏమి చర్చించుంటాడు..? గుంటూరు ఎంపీగా లేదా పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ కావాలని అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. చర్చల సారాంశం తొందరలోనే బయటపడుతుంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. వైసీపీలో చేరిన పదిరోజులకే రాయుడు బయటకు వచ్చేశాడు. ఎంత స్పీడుగా పార్టీలో చేరాడో అంతే స్పీడుగా బయటకు వచ్చేశాడు. అంటే మొదటి ఇన్నింగ్స్ ఆడకుండానే టైమ్ అవుట్ అయిపోయాడని అర్థమవుతోంది.
రెండో ఇన్నింగ్స్ జనసేనలో మొదలుపెట్టబోతున్నాడు. మరి సెకెండ్ ఇన్నింగ్స్ అయినా పూర్తిగా ఆడుతాడా..? లేకపోతే ఇక్కడ కూడా ఒక్క బాల్ కూడా ఆడకుండానే డక్ అవుట్ అయిపోతాడా..? అన్నది చూడాలి. ఏదేమైనా రాజకీయాలంటే రాయుడు దృష్టిలో టీ-20 మ్యాచ్ ఆడటంలాగుంది. టీ20 మ్యాచుల్లో క్రీజులో కుదురుకునేంత సమయం ఉండదు. క్రీజులోకి వచ్చిన దగ్గర నుండి బంతిని బాదటమే టార్గెట్. అదే పద్దతిలో వైసీపీలో చేరగానే ఏదో చేద్దామని అనుకుని ఫెయిలయ్యాడు. మరి జనసేనలో అయినా రెండో ఇన్నింగ్స్ లో సరిగ్గా బ్యాటింగ్ చేస్తాడా..?