ఇప్పటంలో మళ్లీ పని మొదలు పెట్టిన జేసీబీలు..
ఇప్పటికే అక్కడ 70 అడుగుల వెడల్పుతో రోడ్డు ఉందని, పల్లెటూరిలో 120 అడుగుల వెడల్పు రోడ్డు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. 4వేల జనాభా కూడా లేని ఊరిలో ఇదెక్కడి విడ్డూరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆమధ్య ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పుకోసం ఆక్రమణలు కూల్చివేయడం, బాధితులకు మద్దతుగా పవన్ కల్యాణ్ ఆ గ్రామానికి వెళ్లడం, కోర్టు కేసులు, పరిహారం చెక్కులు.. అన్నీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మళ్లీ ఇప్పటంపై జేసీబీలు దండెత్తాయని జనసేన తీవ్ర విమర్శలు చేస్తోంది. జగన్ సైకో అని మరోసారి రుజువైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. కావాలనే శనివారం కూల్చివేతలు పెట్టుకున్నారని, కనీసం కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకునే అవకాశం కూడా లేకుండా చేశారని, ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని మండిపడ్డారు.
విశాఖలో గ్లోబల్ సమ్మిట్ కారణంగా రెండు రోజులపాటు ప్రభుత్వంపై విమర్శ లు చేయకూడదనుకున్నామని, కానీ ఇలా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నామంటున్నారు జనసేన నాయకులు. ఆమధ్య ఇప్పటం గ్రామం వార్తల్లోకెక్కింది. జనసేన సభ కోసం ఇప్పటం గ్రామస్తులు స్థలం ఇవ్వడం, వారికి మద్దతుగా పవన్ కల్యాణ్ మాట్లాడటం తెలిసిందే. ఆ తర్వాత గ్రామంలో రోడ్డు వెడల్పుకోసం ఆక్రమణల కూల్చివేత మరింత సంచలనంగా మారింది. ఇప్పటికే అక్కడ 70 అడుగుల వెడల్పుతో రోడ్డు ఉందని, పల్లెటూరిలో 120 అడుగుల వెడల్పు రోడ్డు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు నేతలు. 4వేల జనాభా కూడా లేని ఊరిలో ఇదెక్కడి విడ్డూరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటి ప్లాన్లు అతిక్రమించి ప్రహరీ గోడలు నిర్మించారంటూ ఈరోజు ఇప్పటంలో అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారు. 12 ఇళ్ల ప్రహరీ గోడలను నగరపాలక సంస్థ అధికారులు రెండు జేసీబీల సాయంతో కూలగొట్టారు. కూల్చివేతలను అడ్డుకొంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. గ్రామ సరిహద్దుల్లో కూడా పహారా పెట్టారు. జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు నరసింహారావు నివాసాన్ని కూల్చేందుకు ప్రయత్నించగా అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు, జనసేన నాయకులు ప్రతిఘటించడంతో ప్రహరీ వరకు కూల్చేసి వదిలేశారు.