చంద్రబాబు వ్యూహంలో జూనియ‌ర్ ఇరుక్కుంటాడా..?

వాస్తవానికి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చాలా రోజుల ముందు నుంచే జరుగుతున్నాయి. కానీ.. చంద్రబాబు, టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్‌ని పట్టించుకున్న దాఖలాలు లేవు.

Advertisement
Update:2023-05-16 07:54 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన వ్యూహాలకి పదును పెడుతున్నాడు. ఎన్నికల్లో నందమూరి ఫ్యామిలీని బలి పశువుగా వాడుకోవడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. 2014, 2019 ఎన్నికల ముందు కూడా ఇలానే నందమూరి ఫ్యామిలీ మెంబర్స్‌ని తెరపైకి తీసుకొచ్చాడు. కానీ, ఎలక్షన్స్ అయిపోగానే మళ్లీ వారిని పక్కన పెట్టేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నాడు. ఇలా చంద్రబాబు కుట్రలకి బలైపోయిన వారిలో నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ, పురందేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి సుహాసిని, నందమూరి తారకరత్న తదితరులు ఉన్నారు.

అయితే.. వీరిలో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చంద్రబాబు కుటిల ఆలోచనల్ని కనిపెట్టి దూరంగా వెళ్లిపోయాడు. కానీ, ఇప్పుడు చంద్రబాబుకి అందరి కంటే జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చాలా అవసరం. అందుకే ఆ దిశగా మళ్లీ పావులు కదుపుతున్నాడు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి జూనియర్ ఎన్టీఆర్‌కి తాజాగా ఆహ్వానం అందింది. అయితే జూనియర్ ఆ ఉత్సవాలకి వస్తాడా..? అంటే సందేహమే. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

వాస్తవానికి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చాలా రోజుల ముందు నుంచే జరుగుతున్నాయి. కానీ.. చంద్రబాబు, టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్‌ని పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే ఇటీవల చంద్రబాబుకి నందమూరి అభిమానుల నుంచి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటనకి చంద్రబాబు వెళ్లిన టైమ్‌లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చిన అభిమానులు ‘సీఎం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ ప్లకార్డ్స్‌‌ని ప్రదర్శించారు. అలానే విజయవాడలో ఇటీవల నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా హాజరయ్యారు. కానీ.. జూనియర్ ఎన్టీఆర్‌ రాకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు దిద్దుబాటు చర్యలకి దిగినట్లు తెలుస్తోంది. దానికి తోడు ఈనెల చివర్లో రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలోని కడియంలో మహానాడు ఉంది. ఆ టైమ్‌కి నందమూరి ఫ్యాన్స్‌ ఆవేశాన్ని చల్లార్చకపోతే ఇబ్బందులు తప్పవని చంద్రబాబు గ్రహించినట్లున్నాడు. అన్నింటికీ మించి ఖమ్మంలో ఏర్పాటు చేసిన 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్‌ని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. ఇది ఇంకా చంద్రబాబుపై నందమూరి ఫ్యాన్స్‌కి కోపం తెప్పించింది. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌కి పిలుపు వెళ్లినట్లు తెలుస్తోంది.

కానీ, చంద్రబాబుతో వేదికని పంచుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ఇష్టపడకపోవచ్చు. అక్కడికి వెళితే రాజకీయాల చుట్టూనే ఉపన్యాసాలు ఉంటాయి. దాంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా వాటి గురించి మాట్లాడక తప్పదు. అదే జరిగితే చంద్రబాబు వ్యూహం సక్సెస్ అయినట్లే. జూనియర్ ఎన్టీఆర్ వెళితే.. అతనితో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా అక్కడికి వెళ్తాడు. అప్పుడు నందమూరి ఫ్యామిలీ మొత్తం మరోసారి తన పక్కనే ఉందనే సంకేతాలు ఫ్యాన్స్‌కి ఇచ్చినట్లు అవుతుంది. చంద్రబాబు ప్లాన్ కూడా ఇదే. మరి జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Tags:    
Advertisement

Similar News