ఈసారి కూడా జగన్మోహన్‌రెడ్డి గెలిస్తే.. ఏమౌతుంది..?
ఇది చాలా కీలకమైన రాజకీయ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు సంబంధించినది. కొన్ని నిజాలు నేరుగా మాట్లాడుకుందాం..
ఇటు రెడ్లూ, అటు కమ్మలూ రాజకీయాధికారం కోసం పెనుగులాడుతున్నారు. ఫైట్ టు ఫినిష్ అనే లెవల్లో ఈసారి రాజకీయ పోరాటం భీకరంగా జరుగుతుంది. ప్రస్తుతానికి జగన్‌కి అడ్వాంటేజ్ కనిపిస్తోంది. క్రమం తప్పకుండా కరెన్సీ నోట్లు అందుకుంటున్న పెద్దవాళ్లూ, మహిళలూ, ముస్లింలూ, దళితులూ, ఇతర పేద వర్గాలూ జగన్ పట్ల కృతజ్ఞతతో ఉన్నారు. రెడ్లు దాదాపు 90 శాతం మంది జగన్ వెంటే ఉంటారు. కమ్మవాళ్లతో పాత గొడవలున్న కాపులు, కొందరు పవన్ కల్యాణ్‌తో, మరి కొందరు జగన్‌తో ఉంటారు. మహిళలూ, దళితులూ జగన్ బలం. ఇదేకాకుండా ఎన్నికలంటే డబ్బు ప్రధానం. వందలు, వేల కోట్లు మంచినీళ్లలా ఖర్చుపెట్టగలగాలి.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్‌కి ఆ సత్తా ఉంది. డబ్బు కిందిస్థాయి కార్యకర్తకి, ఓటరుకి అందించగల మందీమార్బలం జగన్‌కి ఉన్నారు. ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో కొట్టుమిట్టాడిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చుపెట్టగలదో చెప్పలేం. పులి మీద పుట్రలాగా పార్లమెంట్ ఎన్నికలూ ముంచుకొస్తున్నాయి. అదొక అనూహ్యమైన ఖర్చు. పవన్ కళ్యాణ్‌తో పొత్తు, కలిసి పోటీ అంటూ ఆ ఖర్చూ చంద్రబాబు పెట్టుకోవాల్సిందేగా..! కులమూ, డబ్బూ పెనవేసుకుని ఉన్న ఈ కీలక తరుణంలో జగన్మోహన్‌రెడ్డిని ఆపడం అంత సులువేమీ కాదు. ఒకవేళ కాసిన్ని సీట్లు తగ్గినా జగన్ గెలుస్తారని అనుకుందాం. జగన్ విజయం సాధించి, మరో ఐదేళ్లు పరిపాలిస్తే ఏమౌతుంది..?
ప్రజల మాట పక్కనపెడదాం, అసలు తెలుగుదేశం భవిష్యత్ ఏమిటి..? మునుపటి తెలుగు వెలుగు రేపటి చీకటిగా మారనున్నదా..? కొంచెం వాస్తవానికి దగ్గరగా వద్దాం. 1950 ఏప్రిల్ 20న పుట్టిన చంద్రబాబుకి ఇప్పుడు 73 ఏళ్లు. ఐదేళ్లూ అపోజిషన్ అంటే కష్టమే కదా.. 78 ఏళ్లు వచ్చేస్తాయి. చంద్రబాబుకి అండగా, తోడుగా, గురువుగా మార్గదర్శిగా నిలబడిన రామోజీరావు 1936 నవంబర్ 16న పుట్టారు. ఆయనకిప్పుడు 87 ఏళ్లు. ఇంకా ఐదేళ్లంటే 90 దాటిపోతారు. రిటైర్ అయి, ఖాళీగా ఉన్న మరో కమ్మ ప్రభువు ఉదయగిరి వెంకయ్యనాయుడు ఏమన్నా ఆదుకోగలడా..? అంటే, 1949 జూలై 1న పుట్టిన వెంకయ్యకి ఇప్పుడు 74 ఏళ్లు. ఐదేళ్లలో అయినా 80కి చేరువౌతారు. చాలామంది రాజకీయ నాయకుల్లాగే తెలుగుదేశం పార్టీలోనూ సమర్థులైన రెండో ర్యాంక్ నాయకులు ఎదగకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డారు. వస్తే లోకేష్‌బాబే రావాలి, మిగిలిన వాళ్లు అతనికి విధేయులుగా ఉండాలి.. అంతే కదా.. వెరీ సింపుల్ స్కీమ్.
కొడుకు మీద ప్రేమని కాదనలేంగానీ, పుత్రుడు లోకేష్ ప్రజల్ని కాదు సర్, తెలుగుదేశం కార్యకర్తల్ని ఇన్‌స్పైర్ చేయలేడు. రాజకీయాల్లో మనిషి మంచోడు అయితే చాలదు. జనాన్ని కదిలించగలగాలి, ఒప్పించాలి, మెప్పించాలి, రెచ్చగొట్టగలగాలి.. ఆ విద్యలేవీ పాపం లోకేష్‌కి రావు. సో, ఐదు సంవత్సరాల తర్వాత అనగా 2029లో టీడీపీని ఎవరు ముందుకు నడిపిస్తారు..? శ్రీమతి భువనేశ్వరి గానీ, కోడలు బ్రాహ్మణి గానీ, ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి గానీ.. వీళ్లు ఉన్నారు గానీ, హుందాగా ఉంటారు, చక్కని ఇంగ్లిష్ మాట్లాడుతారు.. అంతే తప్ప మాస్ లీడర్లు కాలేరు.. ఎప్పటికీ..!
మిగిలిన ఏ కులానికి ఛాన్స్ లేనేలేదు కనుక కమ్మవారే అయివుండాలి. ఆ షరతుని ఉల్లంఘించడానికి లేదు. ఇక, రా కదలిరా అంటూ జనాన్ని ఊగించి ఉత్తేజపరిచే నాయకుడెవ్వరు..? ఎన్టీ రామారావుకి అసలు సిసలు వారుసుడెవ్వరు..? ఓవర్ యాక్షన్ బాలకృష్ణ అందర్నీ ఒప్పించలేడు. అతన్ని హీరోగా ఇష్టపడే జనం కూడా, రాజకీయ నాయకుడిగా అంగీకరించలేరు. పైగా బాలకృష్ణకు ఇప్పుడే 63 ఏళ్లు..!
హీరో మహేష్‌బాబుకి సూపర్ స్టార్ డమ్ ఉన్నా.. అతని మొగ్గు కాంగ్రెస్ వైపే ఉండొచ్చు. ఇక మిగిలింది ఒక్కడే.. మాస్ హీరో, సూపర్ డ్యాన్సర్ జూనియర్ ఎన్టీఆర్. 1983 మే 20న పుట్టిన జూనియర్‌కి ఇప్పుడు 40 ఏళ్లు మాత్రమే..! ఐదేళ్లు ఆగినా అతనికొచ్చే నష్టం ఏమీలేదు. ప్రజలంతా ప్రేమించే మంచి నటుడు. జనాన్ని ఉత్తేజపరిచే సత్తా ఉన్నవాడు. చంద్రబాబులాంటి వాళ్లకి నచ్చకపోయినా, తెలుగుదేశం పార్టీని హైజాక్ చేయగల శక్తి సంపన్నుడు జూనియర్ ఎన్టీఆర్.
2024 ఏప్రిల్ ఎన్నికలు అందుకే ముఖ్యమైనవి, కీలకమైనవి. 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీకి చావోరేవో తేల్చి చెప్పేవి. ఇప్పుడు అర్థం అవుతోందా చంద్రబాబు ఎందుకంత కంగారుపడుతున్నాడో..? పరుగు పరుగునా అయోధ్యకు ఎందుకు వెళ్లాడో..?
అధికారాన్ని దక్కించుకోవాలి. లక్ష కోట్ల వ్యాపారాల్ని రక్షించుకోవాలి. అయినా చంద్రబాబుకి దిగులే మిగిలిఉంది. అటు చూస్తే జగన్మోహన్‌రెడ్డి, ఇటు లోకేష్ బాబు.. Now Nara Chandra babu caught between the Devil and deep Sea..
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి అధికారం చేజారి, అంధకారం మాత్రమే మిగలడం ఎంత విచిత్రం, దగాపడ్డ ఎన్టీ రామారావు ఆత్మ సంతోషిస్తుందేమో..!