ఇదే జరిగితే ఇక టీడీపీ గల్లంతే

టికెట్లు దక్కని నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తుంటారు. ఇది ప్రతి ఎన్నికల సమయంలోనూ జరిగేదే. పార్టీల ఫిరాయింపులు సర్వసాధారణం. అయితే, వైసీపీ అసమ్మతి నేతలకు ప్రత్యామ్నాయ పార్టీలుగా తెలుగుదేశం, జనసేన ఉండేవి. కానీ, ఇప్పుడు మరో ప్రత్యామ్నాయం వచ్చింది.

Advertisement
Update:2024-01-11 11:15 IST

వచ్చే శాసనసభ, లోకసభ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సాహసోపేత చర్యకు ఒడిగట్టారు. పాదయాత్ర చేసి ప్రజల నాడి తెలిసిన నాయకుడిగా జగన్‌ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో పరిస్థితిని అంచనా వేసుకున్నారు. సర్వేలు చేయించుకున్నారు. దాని ఆధారంగా కొంత మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చడానికి సిద్ధపడ్డారు. ఇటువంటి నిర్ణయాన్ని అమలులో పెట్టే సమయంలో పార్టీలో కొంత కలకలం రేగడం సహజం. అదే సమయంలో టికెట్‌ దక్కని నేతలు అసంతృప్తికి గురై పక్కచూపులు చూడడం కూడా కాదనలేని పరిణామం. తమ తమ నియోజకవర్గాల్లో తమ విజయావకాశాలు తగ్గిపోయినప్పటికీ మళ్లీ పోటీ చేయడానికి నాయకులు పట్టుబడుతుంటారు. అటువంటి స్థితిలో పార్టీ అధినేతగా పార్టీని గెలుపు దారిలో నడిపించాల్సిన బాధ్యతను నిర్వహించాల్సి ఉంటుంది. జగన్‌ అదే పనిచేస్తున్నారు.

టికెట్లు దక్కని నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తుంటారు. ఇది ప్రతి ఎన్నికల సమయంలోనూ జరిగేదే. పార్టీల ఫిరాయింపులు సర్వసాధారణం. అయితే, వైసీపీ అసమ్మతి నేతలకు ప్రత్యామ్నాయ పార్టీలుగా తెలుగుదేశం, జనసేన ఉండేవి. కానీ, ఇప్పుడు మరో ప్రత్యామ్నాయం వచ్చింది. జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో కీలక బాధ్యతలు చేపడుతారని, ఆమెకు పీసీసీ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అసమ్మతి నేతలు కాంగ్రెస్‌ వైపు చూసే అవకాశం ఉంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబును నమ్ముకునే పరిస్థితి ఉండదని వారికి తెలుసు. చంద్రబాబును నమ్ముకున్న ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి పరిస్థితి టీడీపీలో అగమ్యగోచరంగా మారింది. తాము కోరుకున్న సీట్లను చంద్రబాబు కేటాయిస్తారా, లేదా అనుమానాలు వారిని పీడిస్తున్నాయి. ఈ స్థితిలో వైసీపీ అసమ్మతి నేతలు తమ పార్టీలోకి వస్తారనే చంద్రబాబు ఆశలు గల్లంతయ్యే అవకాశాలున్నాయి.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రారెడ్డి కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి సిద్ధపడినట్లు సమాచారం. ఆయన రెండు రోజుల క్రితం ఏఐసీసీ సభ్యుడు రఘువీరా రెడ్డిని కలిశారు. వారి మధ్య కాంగ్రెస్‌లో చేరే విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్‌ కూడా ఈ విషయంపై దృష్టి పెట్టినట్లు, కాపు రామచంద్రారెడ్డికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తున్నది.

వైసీపీ అసమ్మతి నేతలే కాకుండా టీడీపీ అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్‌ వైపు చూసే అవకాశాలున్నాయి. వారిలో కొంత మంది వైసీపీ వైపు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గణనీయమైన ప్రభావం చూపగల విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలోకి వస్తున్నారు. అలాగే మరికొంత మంది కూడా రావచ్చు. టీడీపీ అభ్యర్థుల జాబితా వెలువడితే దానిపై స్పష్టత వస్తుంది. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎలాగూ విజయం సాధించే పరిస్థితి ఉండదు కాబట్టి ఇది వైఎస్‌ జగన్‌కు మేలు చేసే విషయమే. ఆ పార్టీల్లోకి వెళ్లే నాయకులపై ఇదివరకే ప్రజల్లో వ్యతిరేకత ఉండటం వైసీపీ అభ్యర్థులకు కలిసి వస్తుంది. అదే సమయంలో కొత్తవారిని బరిలోకి దింపడం వల్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలుంటాయి.

కొత్త చేరికలతో కాంగ్రెస్‌ కాస్తా బలం పుంజుకుంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌, టీడీపీ కూటమి మధ్య చీలిపోయే అవకాశాలుంటాయి. మరో వైపు బీజేపీ కూడా పోటీలో ఉంటుంది. దీనివల్ల వైసీపీకి మేలు జరిగే పరిణామాలు చోటు చేసుకుంటాయి. దానికి తోడు, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. ఏమైనా చంద్రబాబు ఆశలు వచ్చే ఎన్నికల్లో ఫలించే పరిస్థితి లేదు.

Tags:    
Advertisement

Similar News