ప్లీజ్.. నన్ను సీఎం చేయండి -పవన్
తనను సీఎం చేయాలని ప్రజలను అభ్యర్థించారు. జనసేనకు అధికారమిస్తే రాష్ట్రాన్ని నెంబర్-1 గా తీర్చిదిద్దుతానన్నారు పవన్ కల్యాణ్.
పవన్ కల్యాణ్ మాట మార్చారు. ఆమధ్య తాను సీఎం కాలేనంటూ బేలగా మాట్లాడి ట్రోలింగ్ ఎదుర్కొన్న ఆయన వారాహి యాత్రలో తానే సీఎం అవుతానన్నారు. ప్రజలు తనకు అధికార పీఠం అప్పగించాలన్నారు. మిమ్మల్ని అడుగుతున్నా, వేడుకుంటున్నా, అభ్యర్థిస్తున్నా.. నన్ను సీఎం చేయండి అంటూ పిఠాపురం సభలో ప్రసంగించారు పవన్ కల్యాణ్. సీఎం కావడానికి తాను మానసిక సంసిద్ధతతో ఉన్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్ర బాధ్యతలు తీసుకోడానికి తాను రెడీ అన్నారు.
అదంతా తూచ్..
గతంలో తాను సీఎం కాలేనంటూ మాట్లాడిన పవన్ కల్యాణ్ పై వైసీపీ ఓ రేంజ్ లో విరుచుకుపడింది. సీఎం కాలేను అని చెప్పుకుంటున్న పవన్ కి అభిమానులు సైతం ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నించారు వైసీపీ నేతలు. సీఎం కాలేనంటూ పవన్ చెప్పిన మాట జనసైనికులకు కూడా నచ్చలేదు. దీంతో పవన్ లో ఆలోచన మొదలైంది. సీఎం అవుతామో కామో తర్వాతి సంగతి, కనీసం సీఎం రేసులో తానున్నానని చెప్పడానికి వెనకడుగేయడం ఎందుకని భావించారు. వారాహి యాత్రలో తనను సీఎం చేయాలని ప్రజలకు సూచించారు. జనసేనకు అధికారమిస్తే రాష్ట్రాన్ని నెంబర్-1 గా తీర్చిదిద్దుతానన్నారు పవన్ కల్యాణ్. 2019 ఎన్నికల్లో కూడా తాను ఇంత ధైర్యంగా ఈ మాట చెప్పలేదని, కానీ ఇప్పుడు చెబుతున్నానని, తనకి ముఖ్యమంత్రి పీఠం కావాలన్నారు.
ఎంపీ కుటుంబాన్ని కాపాడుకోలేని ప్రభుత్వం ఎందుకు..?
సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయితే.. రాష్ట్ర డీజీపీ కథలు చెబుతున్నారని, ఐపీఎస్ చదువుకున్న ఆయన అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. జనసేన అధికారంలోకి వస్తే కిడ్నాపర్లు గేటుదాటి లోపలకు రావడానికి కూడా భయపడతారన్నారు. గోదావరి జిల్లా ప్రజలు మేలుకుంటే ఏపీలో రాజకీయాలు మారిపోతాయన్నారు పవన్. అందుకే తాను ఇక్కడే ఉంటానన్నారు. ఈసారి తాను గెలవడానికి ఎన్ని వ్యూహాలు పన్నడానికయినా సిద్ధం అని అన్నారు పవన్.