రాయలసీమకు చంద్రబాబు గోదావరి ‘నీటి మూట’
రాయలసీమ ప్రాజెక్టులను ఆయన ఏ రోజూ పట్టించుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాజెక్టులపై శ్రద్దపెట్టారు.
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి హామీల వర్షం చూస్తుంటే ఆ సామెత గుర్తుకు వస్తోంది. రాయలసీమకు గోదావరి నీళ్లు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాప్తాడు ప్రజాగళం సభలో ఆయన ఆ హామీ ఇచ్చారు. రాయలసీమ గురించి ఆయన పట్టించుకున్నదెప్పుడు? రాయలసీమ ప్రజల మేలు గురించి ఆయన ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. ఎన్నికలు రాగానే హామీలు ఇవ్వడం ఆ తర్వాత మరిచిపోవడం కూడా ఆయన నైజం.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఐదేళ్ల పాటు కాలం గడిపిన ఆయన గోదావరి నీళ్లను రాయలసీమకు ఇస్తానంటే నమ్మడం ఎలా అనేది ప్రశ్న. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని తానే నిర్మిస్తానని కేంద్ర ప్రభుత్వం నుంచి లాగేసుకుని డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినేలా ఇతర నిర్మాణాలు చేపట్టారు. కమీషన్ల కోసమే కనీస సాంకేతిక విలువలను కూడా పట్టించుకోలేదని బయటపడింది.
రాయలసీమ ప్రాజెక్టులను ఆయన ఏ రోజూ పట్టించుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాజెక్టులపై శ్రద్దపెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అసలు పట్టించుకోలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేసేందుకు నడుం బిగించారు. ఇతర ప్రాజెక్టులతో పాటు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేశారు.
చంద్రబాబు నియోజకవర్గం కుప్పం ప్రజల దాహార్తిని జగన్ తీర్చారు. కుప్పం నియోజకవర్గంలోని సాగు భూములకు కూడా నీరు అందించారు. కుప్పం నియోజకవర్గం ప్రజలకు జగన్ అందించిన సంక్షేమ పథకాలకు, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు బెదిరిపోయారు. అందుకే కుప్పం నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. గతంలో ఆయన కుప్పంలో స్వయంగా ప్రచారానికి దిగలేదు.