మైనర్ బాలిక హత్యపై హోం మంత్రి కీలక వ్యాఖ్యలు

చీరాల ఘటనలో 36గంటల లోపే నిందితుడిని పట్టుకున్నామని, ఇప్పుడు కూడా నిందితుడిని రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తామని చెప్పారు హోం మంత్రి అనిత.

Advertisement
Update:2024-07-07 17:42 IST

ఏపీలో జరుగుతున్న నేరాలు, ఘోరాలకు గంజాయి, డ్రగ్స్ వినియోగం ప్రధాన కారణంగా మారిందని అన్నారు హోం మంత్రి వంగలపూడి అనిత. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక హత్యోదంతంపై హోం మంత్రి స్పందించారు. సురేష్ అనే యువకుడిపై ఇప్పటికే కేసు పెట్టారని, జైలుకి కూడా పంపించారని, ఇటీవలే జైలునుంచి విడుదలైన సురేష్, ఆ బాలికను హత్య చేశారని వివరించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతి త్వరలో అతడిని అరెస్ట్ చేస్తామన్నారు. నిందితుడికి పోలీసులు సహకరిస్తున్నారన్న వాదన వట్టిదేనన్నారు హోం మంత్రి అనిత. అదే నిజమైతే పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


చీరాల ఘటనలో 36గంటల లోపే నిందితుడిని పట్టుకున్నామని, ఇప్పుడు కూడా నిందితుడిని రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తామని చెప్పారు హోం మంత్రి అనిత. ఇలాంటి ఘటనల్లో ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. కొత్త ప్రభుత్వంలో పోలీసింగ్ ని పటిష్టం చేస్తున్నామని, దారుణాలు జరిగిన వెంటనే పోలీసులు స్పందిస్తున్నారని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు హోం మంత్రి.

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు హోం మంత్రి అనిత. ఏపీలో దిశ అనే చట్టమే లేదని, ఆ చట్టం పేరుతో గత ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని అన్నారామె. ఇప్పుడున్న చట్టాలనే పటిష్టపరచుకోవాల్సి ఉందని చెప్పారు. చట్టప్రకారం నిందితులకు శిక్షపడేలా చేస్తామన్నారు అనిత. 

Tags:    
Advertisement

Similar News