లోక్ సభ కాకపోతే అసెంబ్లీ.. గోరంట్లకు జగన్ హామీ ఇచ్చారా..?
హిందూపురం ఎంపీ టికెట్ లేకపోయినా పర్లేదు, కనీసం ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం అయినా బీసీ కోటాలో తనకు కేటాయించాలని సీఎం జగన్ ని గోరంట్ల మాధవ్ అడిగినట్టు తెలుస్తోంది.
ఏపీలో కొంతమంది వైసీపీ నేతలకు సీట్లు గల్లంతవుతున్న విషయం తెలిసిందే. వీరిలో కొంతమందికి ముందుగానే జగన్ అపాయింట్ మెంట్ లభిస్తోంది, మరికొందరిని మాత్రం లిస్ట్ బయటికొచ్చాక పిలిపించుకుని మాట్లాడుతున్నారు సీఎం. తాజాగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్ ని కలసి వచ్చారు. ఆయనకు జగన్ ఏ హామీ ఇచ్చారు..? ఉద్యోగానికి రాజీనామా చేసిమరీ రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల మాధవ్ కి ప్రత్యామ్నాయం ఏంటి..?
కొంతమందికి లేటెస్ట్ గా షాక్ లు తగులుతున్నాయి కానీ, హిందూపురం ఎంపీ మాధవ్ విషయంలో రెండోసారి టికెట్ వస్తుందని చాలాముందుగానే తేలిపోయింది. గతంలో వీడియో కాల్ వ్యవహారం బయటకొచ్చాక ఆయన ఇమేజ్ డ్యామేజీ అయింది. అప్పటికప్పుడు అధిష్టానం ఎలాంటి చర్య తీసుకోలేదు కానీ, టైమ్ చూసి టికెట్ క్యాన్సిల్ చేసింది. అటు మాధవ్ కూడా మిగతా నాయకుల్లాగా తొందరపడలేదు, నోరు జారలేదు, ఎక్కడా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. నేరుగా తాడేపల్లి వెళ్లి జగన్ ని కలసి వచ్చారు. తన సీటు విషయం చర్చించేందుకే జగన్ ని కలిశానన్నారాయన. అయితే జగన్ పాజిటివ్ గా స్పందించారా లేదా అనేది తేలాల్సి ఉంది.
కనీసం అసెంబ్లీకయినా..
హిందూపురం ఎంపీ టికెట్ లేకపోయినా పర్లేదు, కనీసం ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం అయినా బీసీ కోటాలో తనకు కేటాయించాలని సీఎం జగన్ ని గోరంట్ల మాధవ్ అడిగినట్టు తెలుస్తోంది. అయితే అటునుంచి సానుకూల సంకేతాలేవీ లేవని అంటున్నారు. అందుకే ఎంపీ మాధవ్ సైలెంట్ గా క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకొచ్చేశారు. ప్రస్తుతానికి మాధవ్ టికెట్ పై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరి టికెట్ లేకపోయినా ఆయన పార్టీలోనే ఉంటారా, పార్టీకోసం పనిచేస్తారా..? అనేది వేచి చూడాలి.