గోరంట్ల మాధవ్ కుల రాజకీయం బెడిసికొట్టిందా?

వచ్చే ఎన్నికల్లో శ్రీదేవికి చెక్ పెట్టి ఆ సీటును తాను సాధించుకోవాలని గోరంట్ల మాధవ్ ప్రయత్నిస్తున్నారు. తన పరిధి కాకపోయినా సరే సొంత ప్రాంతం అంటూ పత్తికొండ సెగ్మెంట్‌లో మాధవ్‌ పర్యటిస్తూ కుల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement
Update:2023-09-02 12:37 IST

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌.. తనకు కేవలం కులబలం చూసే ఎంపీ టికెట్‌ ఇచ్చారన్న భావనతో ఉంటారన్న విమర్శ ఉంది. కులాభిమానాన్ని ఆయన దాచుకోరు కూడా. కురబ నాయకుడిగా సొంత సామాజికవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. రెడ్లు గానీ, కమ్మోళ్లు గానీ తన కులపోళ్ల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ బహిరంగంగానే గతంలో వార్నింగ్ కూడా ఇచ్చారు.

అయితే ఈసారి హిందూపురం ఎంపీగా కాకుండా తన సొంత జిల్లాకు వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. అందుకోసం కర్నూలు జిల్లాలో తన కులపోళ్లు ఎక్కువగా ఉన్న స్థానాన్ని ఆన్వేషించి పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంపై కన్నేశారు. అక్కడ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈమె భర్త నారాయణ రెడ్డి గతంలో టీడీపీ నేతల చేతిలో అతి దారుణంగా హత్యకు గురయ్యారు.

వచ్చే ఎన్నికల్లో శ్రీదేవికి చెక్ పెట్టి ఆ సీటును తాను సాధించుకోవాలని గోరంట్ల మాధవ్ ప్రయత్నిస్తున్నారు. తన పరిధి కాకపోయినా సరే సొంత ప్రాంతం అంటూ పత్తికొండ సెగ్మెంట్‌లో మాధవ్‌ పర్యటనలు చేస్తుంటారు. కుల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల తన సోదరుడి కుమారుడి వివాహ వేడుకను తన రాజకీయ సత్తాకు వేదికగా మార్చుకునే ప్రయత్నం చేశారు. పత్తికొండలోని తన సామాజికవర్గం వారితో మాధవ్ దంపతులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మీరు మద్దతు ఇస్తే.. మీకు నేను అండగా ఉంటానని మాధవ్‌ కోరారు. ఆ సమావేశంలోనే సోదరుడి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికలను పంచిపెట్టారు.

సోదరుడి కుమారుడి వివాహానికి ఏపీతో పాటు కర్నాటకకు చెందిన తన సామాజికవర్గం నేతలను ఆహ్వానించారు. ఈ పెళ్లికి ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డితో పాటు...కర్నాటక సీఎం సిద్ధరామయ్యను పిలిచి తన పవర్‌ ఏంటో చూపించాలని మాధవ్‌ భావించారు. అయితే ఈ వివాహానికి ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరుకాలేదు. ఎమ్మెల్యేగా శ్రీదేవి ఉన్నప్పటికీ పత్తికొండలో మాధవ్ ఏ ఉద్దేశంతో వేలు పెడుతున్నారో జగన్‌కు తెలుసని అందుకే ఈ తరహా రాజకీయాలను ప్రోత్సహించకూడదనే జగన్‌ రాలేదన్న ప్రచారమూ నడుస్తోంది. లోకల్‌ ఎమ్మెల్యే శ్రీదేవితో పాటు నియోజకవర్గంలోని వైసీపీ కీలక నేతలు కూడా పెళ్లికి రాలేదు. దాంతో పత్తికొండలో పాగా వేయాలనుకుంటున్న మాధవ్‌ ఆలోచన ఎంతవరకు సఫలం అవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మితిమీరి కులం రంగు పూసుకుంటూ మాధవ్‌ ఇతర వర్గాలకు దూరమవుతున్నారన్న అభిప్రాయమూ బలంగా ఉంది.

Tags:    
Advertisement

Similar News