చింతకాయలకు లభించని ఊరట

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి అరెస్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. కేసు డైరీ చూశాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.

Advertisement
Update:2022-11-03 18:41 IST

ఫోర్జరీ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టులో తక్షణ ఊరట లభించలేదు. తెల్లవారుజామున సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయగా... వెనువెంటనే ఆయన తరపున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలైంది. కేసును కొట్టివేయాలని అయ్యన్నతరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. నిందితులపై పెట్టిన సెక్షన్లు చెల్లుబాటు కావని, ఇదంతా కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చేస్తున్నారని పిటిషనర్ తరపున న్యాయవాదులు వాదించారు.

ఈ వాదనను సీఐడీ తోసిపుచ్చింది. నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతనే కేసు నమోదు చేశామని సీఐడీ తరపు న్యాయవాది వివరించారు. 0.2 సెంట్ల భూమిని ఆక్రమించారని అందుకు పక్కా ఆధారాలున్నాయని వెల్లడించారు. ఎన్‌వోసీ కోసం ఏఈ సంతకాన్ని ఫోర్జరీ చేశారని వివరించారు. భూమి విలువ రూ.10 వేలకు పైగా ఉందని.. అందుకే 41ఏ కింద నోటీసులు ఇవ్వలేదని వాదించారు. అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించామని చెప్పారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కేసు డైరీని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. కేసు డైరీని కోర్టు ముందు ఉంచాలని శుక్రవారం విచారణ జరుపుతామని చెబుతూ విచారణను వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News