వడ్డీ ఎలా అడుగుతారు- ఏపీ హైకోర్టు
బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగితే వడ్డీ చెల్లించేలా కాంట్రాక్ట్ ఒప్పందంలో నిబంధన ఉందా అని ప్రశ్నించింది. అలాంటిదేమీ లేదని చెప్పగా.. మరి వడ్డీ చెల్లించాలని ఎలా చెబుతారని కోర్టు ప్రశ్నించింది.
ఏపీలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన బాబురావు అనే కాంట్రాక్టర్.. తాను చేసిన పనులకు 23 లక్షల బిల్లు పెండింగ్‌లో ఉందని.. కావున వడ్డీతో సహా తనకు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని ఇది వరకు కోర్టును కోరారు.
ఆ పిటిషన్‌ను విచారించిన బట్టు దేవానంద్.. 23 లక్షలతో పాటు 12 శాతం వడ్డీతో బిల్లు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం అప్పీల్ చేసింది. అసలు మొత్తాన్ని ఇప్పటికే చెల్లించామని.. వడ్డీతో చెల్లించాలనడం సరికాదని ప్రభుత్వం వాదించింది. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి.. చేసిన పనులకు వడ్డీ ఎలా అడుగుతారని ప్రశ్నించారు. బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగితే వడ్డీ చెల్లించేలా కాంట్రాక్ట్ ఒప్పందంలో నిబంధన ఉందా అని ప్రశ్నించింది. అలాంటిదేమీ లేదని చెప్పగా.. మరి వడ్డీ చెల్లించాలని ఎలా చెబుతారని కోర్టు ప్రశ్నించింది.
అసలు వడ్డీలు చెల్లించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడానికి హైకోర్టు ఏమీ సివిల్ కోర్టు కాదు కదా అని సీజే వ్యాఖ్యానించారు. నిబంధనల్లో వడ్డీ చెల్లించాలని లేనప్పుడు.. అలా వడ్డీ చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కాంట్రాక్టర్లు హైకోర్టును కోరడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
హైకోర్టు తమపై పడుతున్న కేసు భారాన్ని ప్రస్తావించింది. తమ వద్ద రోజువారీగా దాఖలవుతున్న పిటిషన్లలో 70 శాతం వరకు పంచాయతీరాజ్, జలవనరుల శాఖ నుంచి బిల్లుల చెల్లింపు వ్యవహారంపైనే ఉంటున్నాయని.. రోజుకు ఈరెండు శాఖల నుంచే 200 వరకు పిటిషన్లు దాఖలవుతున్నాయని.. ఇది హైకోర్టుకు భారంగా మారుతోందని సీజే వ్యాఖ్యానించారు.