నాయకత్వంపై పార్టీలో పోటీనా?

బాలయ్య ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలు తెలియగానే లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి రాజమండ్రిలో పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు. అందుబాటులోని నేతలను పిలిపించుకుని భువనేశ్వరితో మాట్లాడించారు.

Advertisement
Update:2023-09-14 11:26 IST

చంద్రబాబునాయుడు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో నాయకత్వం కోసం పోటీ మొదలైందా? దీంతో నేతల్లో అయోమయం పెరిగిపోతోందా? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఐదు రోజుల క్రితం అవినీతి ఆరోపణలపై చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆయ‌న‌కు 14 రోజుల రిమాండు విధించింది.

రిమాండు సంగతి పక్కనపెట్టేస్తే చంద్రబాబు బయటకు రావటంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దాంతో చంద్రబాబు ఇప్పుడిప్పుడే బయటకురాలేరు అని అర్థ‌మవుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు బావమరిది కమ్ వియ్యంకుడు+హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్టీని నడిపేందుకు రెడీ అయిపోయారు. వరుసగా పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని తానే ముందుండి నడిపిస్తానని ప్రకటించి పార్టీ కార్యాచరణపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. తొందరలోనే జిల్లాల పర్యటనలకు బ్లూ ప్రింట్ రెడీ చేయాలని నేతలకు బాలయ్య చెప్పారు.

బుధవారం బాలయ్య ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలు తెలియగానే లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి రాజమండ్రిలో పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు. అందుబాటులోని నేతలను పిలిపించుకుని భువనేశ్వరితో మాట్లాడించారు. పార్టీ కార్యక్రమాలపై భువనేశ్వరి సమీక్షించారు. వివిధ జిల్లాల నుండి నేతలను రాజమండ్రికి రమ్మని కబురు చేశారు. లోకేష్ పక్కనే ఉండి తల్లి భువనేశ్వరితో ఇదంతా చేయిస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత పార్టీలో నాయకత్వం కోసం నందమూరి-నారా కుటుంబాల మధ్య పోరాటం మొదలైందా అనే ప్రచారం మొదలైంది. నిజానికి బాలయ్యకు అయినా లోకేష్‌కు అయినా పార్టీని సమర్థ‌వంతంగా నడిపించేంత సీనైతే లేదనే చర్చ కూడా జరుగుతోంది.

భువనేశ్వరి ఇంతవరకు పార్టీ నేతలతో బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడిందిలేదు. కుప్పం నేతలతో మాత్రమే టెలికాన్ఫరెన్సులో మాట్లాడారు. అలాంటిది బుధవారం సడెన్‌గా నేతలను పిలిపించుకుని సమీక్షలు నిర్వహించటమంటే నాయకత్వం నారా కుటుంబం చేతుల్లోనే ఉందని చెప్పదలచుకున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అవసరమైతే భువనేశ్వరి, బ్రాహ్మణి జనాల్లో వెళ్ళటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పుడు బాలయ్య చెప్పినట్లుగా జిల్లాల పర్యటనలకు బ్లూ ప్రింట్ రెడీ చేయాలా? లేకపోతే భువనేశ్వరి చెప్పినట్లుగా నేతలంతా రాజమండ్రికి చేరుకోవాలా అన్నది అర్థంకావటంలేదు. ఈ రోజు సాయంత్రం రాజమండ్రి జైలులో చంద్రబాబు-బాలయ్య భేటీ సందర్భంగా ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుందేమో చూడాలి.

Tags:    
Advertisement

Similar News