కాపు డిక్లరేషన్ ఏది..? పవన్ పరువు తీసిన జోగయ్య
బీసీల అభివృద్ధికి హామీలిచ్చావు సరే మరి కాపుల సంగతేంటి..? అంటూ పవన్ ని సూటిగా ప్రశ్నించారు హరిరామ జోగయ్య.
ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య.. వీరిద్దరూ పవన్ మంచి కోరారు. కానీ పవన్, చంద్రబాబు వలలో చిక్కుకోవడంతో కొన్నాళ్లు సలహాలిచ్చి చూశారు. చివరకు సలహాలిచ్చేవారినే పవన్ టార్గెట్ చేసే సరికి సహించలేకపోయారు. ముద్రగడ వైసీపీలోకి వెళ్తుండగా.. జోగయ్య మాత్రం పవన్ నిజ స్వరూపాన్ని ప్రజలకు చెప్పేందుకు సిద్ధమయ్యారు. తనదైన శైలిలో మరోసారి జనసేనానికి లేఖాస్త్రం సంధించారు జోగయ్య.
కాపు డిక్లరేషన్ ఏది..?
ఇటీవల జయహో బీసీ సభలో పాల్గొన్న పవన్, చంద్రబాబుతో కలసి బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. బీసీల అభివృద్ధికి తమ కూటమి కృషి చేస్తుందన్నారు. చంద్రబాబు 10 హామీలిస్తే.. బీసీలకు రాజ్యాధికారం దక్కేలా చేస్తామని పవన్ 11వ హామీ ఇవ్వడం విశేషం. బీసీల అభివృద్ధికి హామీలిచ్చావు సరే మరి కాపుల సంగతేంటి..? అంటూ పవన్ ని సూటిగా ప్రశ్నించారు హరిరామ జోగయ్య. జనాభాలో 25శాతం ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తుల ఆర్ధిక సామాజిక పరిస్థితులను కూడా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.
కాపు కులస్తులు బ్రిటీష్ ప్రభుత్వకాలంలోనే బీసీలుగానే పరిగణింపబడేవారంటూ పవన్ కు తాను రాసిన లేఖలో గుర్తు చేశారు హరిరామజోగయ్య. కానీ తర్వాత కాలంలో బీసీ గుర్తింపు రద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలతో సమానంగా 25శాతం జనాభా ప్రాతిపదికన కాపులకు కూడా సంక్షేమం దక్కాల్సి ఉందన్నారు. పవన్ కోరిక ప్రకారం కాపు కులస్తులు కూడా యాచించే స్థితి నుంచి శాసించే స్థితిని చేరాల్సిందేనన్నారు. టీడీపీ- జనసేన కూటమి వెంటనే కాపు డిక్లరేషన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. జోగయ్య లేఖను పవన్ ఎప్పుడూ సీరియస్ గా తీసుకున్న దాఖలాలు లేవు, కానీ ఈసారి ఆయన లాజిక్ తో కొట్టారు. బీసీ డిక్లరేషన్ ఇచ్చిన కూటమి.. కాపు డిక్లరేషన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు జోగయ్య. మరి దీనికి పవన్ నుంచి సమాధానం ఉంటుందా, లేక డిక్లరేషన్ తోనే ఆయన సమాధానం ఇస్తారా..? వేచి చూడాలి.