ఏంటి అన్ని సీట్లే! - జోగయ్యకు చెవిలో చెప్పిన పవన్

సీఎం పదవిలోనూ రెండున్నరేళ్ల పాటు షేర్ అడగాలని సూచన చేసినట్టు వివరించారు. బీజేపీ కూడా త్వరలోనే పొత్తులోకి వస్తుందని పవన్ కల్యాణ్ తనకు చెప్పారన్నారు.

Advertisement
Update: 2024-01-13 12:37 GMT

జనసేన కేడర్‌ ఆశకు.. పవన్‌ కల్యాణ్‌ స్థితికి మధ్య పొంతన కుదరడం లేదు. ఒకవైపు లోకేష్ సూటిగా పవన్‌ కల్యాణ్‌కు సీఎం పదవిలో షేర్ ఇచ్చే ఛాన్సే లేదని చెప్పినా.. చివరకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలా వద్దా అన్నది చంద్రబాబు, టీడీపీ నిర్ణయిస్తుందని చెప్పినా, జనసేన అభిమానులు మాత్రం సీఎం జపం ఆపడం లేదు. తాజాగా మాజీ మంత్రి హరిరామజోగయ్య పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. కలిసిన తర్వాత ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.

బీజేపీ- టీడీపీ- జనసేన కలిసి పోటీ చేయాల్సిన అవసరంపై తాము చర్చించినట్టు వివరించారు. గత ఎన్నికల్లో జనసేన 10వేలకు పైగా ఓట్లు సాధించిన నియోజకవర్గాల జాబితాను పవన్‌ కు అందజేశానని.. ఆ లెక్కన 60 సీట్లు డిమాండ్ చేయాల్సిందిగా సూచించానన్నారు. అందుకు పవన్ కల్యాణ్ 40 సీట్ల వరకు పొత్తులో సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారన్నారు.

సీఎం పదవిలోనూ రెండున్నరేళ్ల పాటు షేర్ అడగాలని సూచన చేసినట్టు వివరించారు. బీజేపీ కూడా త్వరలోనే పొత్తులోకి వస్తుందని పవన్ కల్యాణ్ తనకు చెప్పారన్నారు. పవన్‌ కల్యాణ్‌ను సీఎంగా చూడాలని ప్రతి జనసేన కార్యకర్త ఆకాంక్షిస్తున్నట్టు జోగయ్య వివరించారు.

అయితే నిజంగా 40 సీట్లు తీసుకుంటామని పవన్ కల్యాణ్ చెప్పారా?. చెప్పి ఉన్నా అందుకు టీడీపీ అంగీకరిస్తుందా అన్నది అనుమానమే. మహా అయితే ఓ 15లేదా 20 సీట్లతో సరిపెట్టాలని టీడీపీ భావిస్తోంది. పవర్‌లో షేర్‌ ఇచ్చేందుకూ ససేమిరా అంటోంది. అచ్చెన్నాయుడు అయితే పవన్ కల్యాణ్ సమక్షంలోనే గతంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా 160 సీట్లు సాధిస్తుందని చెప్పేశారు.

పొత్తు టీడీపీకి కాదు.. జనసేనకే అత్యవసరం అన్నది టీడీపీ వాదన. పొత్తు లేకపోతే పవన్‌ కల్యాణ్ కూడా ఎమ్మెల్యే కాలేరని.. ఆ తర్వాత జనసేన పార్టీ అన్నదే కనుమరుగు అవుతుందని, కాబట్టి ఎన్ని సీట్లు ఇచ్చినా పవన్‌ ఒప్పుకుని తీరుతారని టీడీపీ ధీమాగా ఉంది.

Tags:    
Advertisement

Similar News