హమ్మయ్య.. జోగయ్య ఫస్ట్ టైమ్ అలా లేఖ రాశారు

వాస్తవానికి చంద్రబాబుతో కూటమి కట్టడం, పొత్తు పేరుతో కేవలం 21 సీట్లకు జనసేన పరిమితం కావడం హరిరామ జోగయ్యకు ఇష్టం లేదు.

Advertisement
Update:2024-03-30 17:20 IST

హరిరామ జోగయ్య నుంచి లేఖ వస్తుందంటే చాలు పవన్ కల్యాణ్ లో వణుకు మొదలవుతుంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ అక్షింతల లేఖలే ఆయన నుంచి పవన్ కి అందాయి. కానీ తొలిసారి ఆయన జనసేనానిని ఉద్దేశించి ఓ పాజిటివ్ లేఖ రాశారు. పవన్ ప్రచార యాత్ర మొదలవుతున్న నేపథ్యంలో కాపు, బలిజ సంక్షేమ సేన ఆఫీస్ బేరర్లు, సభ్యులకు లేఖ రాశారు హరిరామజోగయ్య.




 

పవన్ కల్యాణ్ పర్యటనకు వస్తున్నారని, 15రోజులపాటు ఆయన ప్రజల్లోకి వస్తారని, జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో ఆయన మీటింగ్ లు పెడతారని, ఆ పర్యటనలకు హాజరై విజయవంతం చేయాలని, జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని తన లేఖలో పేర్కొన్నారు జోగయ్య. ఆయన నుంచి పాజిటివ్ లేఖ రావడంతో జనసేన నేతలు కూడా ఆ లేఖను విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. పవన్ కు కాపు, బలిజ సంక్షేమ సేన మద్దతు ఉందని చెబుతున్నారు. పిఠాపురంలో కాపుల ఓట్లన్నీ వన్ సైడ్ గా తమకే పడతాయని వారు అంటున్నారు.

వాస్తవానికి చంద్రబాబుతో కూటమి కట్టడం, పొత్తు పేరుతో కేవలం 21 సీట్లకు జనసేన పరిమితం కావడం హరిరామ జోగయ్యకు ఇష్టం లేదు. సీఎం సీటు అడిగి తీసుకోవాలని ఆయన పవన్ పై ఒత్తిడి చేశారు, అలా కుదరకపోతే ఒంటరిగానే పోటీ చేయాలన్నారు. కానీ పవన్ మాత్రం ఆయన్ను లైట్ తీసుకున్నారు. తనకు ఉచిత సలహాలిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జోగయ్యకు పవన్ కు మధ్య గ్యాప్ పెరిగింది. తాజా లేఖతో ఆ గ్యాప్ భర్తీ అయింది. ఇప్పుడు ధన్యవాదాల పేరుతో పవన్ కల్యాణ్ జోగయ్యకు మరో లేఖ రాస్తారో, లేక నేరుగా ఆయన వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారో.. వేచి చూడాలి. ఏది ఏమయినా పిఠాపురంలో కాపు ఓట్లు గంపగుత్తగా తనకే పడాలనేది పవన్ ఆశ. అందుకే ఏరికోరి ఆ నియోజకవర్గాన్ని పోటీకి ఎంపిక చేసుకున్నారు. 

Tags:    
Advertisement

Similar News