చాగంటికి గురజాడ పురస్కారం... విజయనగరంలో నిరసన ప్రదర్శనలు

చాగంటి కోటేశ్వరావును ఇటీవల ప్రతిష్ఠాత్మక 'గురజాడ' సాహితీ పురస్కారానికి ఎంపిక చేశారు. కాగా దీనిపై సాహిత్య, సాంస్కృతిక సంఘాలు మండిపడుతున్నాయి. గురజాడ ఎంతో చైతన్యంతో రచనలు చేశారని .. అటువంటి మహాకవి పేరుమీద ఇస్తున్న పురస్కారాన్ని చాగంటికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ ఈ ఉదయం విజయనగరంలోని గురజాడ ఇంటి నుంచి నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

Advertisement
Update:2022-11-27 16:08 IST

ప్రముఖ రచయిత, నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా ఈ నెల 30న ఆయన పేరుతో ప్రతీ ఏడు ఇస్తున్న పురస్కారాన్ని ఈ సారి చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వనున్నారు. ఆయన పేరు ప్రకటించినప్పటినుంచి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక మంది రచయితలు, కవులు, మేదావులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

గురజాడ అప్పారావు తన జీవితకాలం మొత్తం హేతువాదిగా, అభ్యుదయవాదిగా ఉన్నార‌ని, అందుకు విరుద్దంగా ప్రగతి వ్యతిరేక, బూజుపట్టిన భావజాలాన్ని ప్రచారం చేసే చాగంటికి గురజాడ పురస్కారాన్ని ఎలా ఇస్తారంటూ హేతువాదులు, కవులు, కళాకారులు, రచయితలు మండిపడుతున్నారు.గతాన్ని వదిలి ముందుకెళ్లాలని పిలుపునిచ్చిన వ్యక్తి మహాకవి గురజాడ అని, అందుకు విరుద్దంగా అందరూ పాత రోజులకు వెళ్లాలని ప్రచారం చేసే వ్యక్తి చాగంటి అని సాహిత్యకారులు విమర్శిస్తున్నారు.

చాగంటికి గురజాడ పురస్కారం ఇవ్వాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ రోజు విజయనగరంలో సాహితీ, సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గురజాడ గౌరవయాత్ర పేరుతో ఈ ర్యాలీ గురజాడ ఇంటి నుంచి బయలుదేరి పట్టణ ప్రధాన కూడళ్ళ మీదుగా సాగింది. గురజాడ అవార్డును చాగంటికి ఇవ్వడం సరికాదని నినాదాలు చేశారు. గురజాడ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించారు.

కాగా ఇప్పటి వరకు గురజాడ పురస్కారాన్ని ఎస్పీ బాలసుబ్రమణ్యం, గరికపాటి నరసింహారావు, సినీ డైరెక్టర్ కె.విశ్వనాథ్, గొల్లపూడి మారుతీరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డైరెక్టర్ క్రిష్, రామజోగయ్యశాస్త్రి, తనికెళ్ల భరణి, అంజలీదేవి, గుమ్మడి, షావుకారు జానకి, సి.నారాయణరెడ్డి, సుద్దాల అశోక్ తేజ, మల్లెమాల, రావి కొండలరావు, డైరెక్టర్ వంశీ, నాగభూషణ శర్మ తదితరులు అందుకున్నారు. 

అయితే ఈ వివాదం నేపథ్యంలో నిర్వాహకులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా ? లేక చాగంటి అవార్డు తీసుకోకుండా ఉంటారా ? లేదా అవార్డు కార్యక్రమం యదావిధిగా జరిగిపోతుందా ? అనేది తేలాల్సి ఉంది.

ఇటీవల ప్రవచన కారులపై తరుచూ వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. స్త్రీలకు సంబంధించి నోటికొచ్చినట్టు మాట్లాడారని ఆధ్యాత్మికవేత్త గరికపాటిపై విమర్శలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. కాగా తాజాగా చాగంటి విషయంలోనూ మరో వివాదం జరగటం గమనార్హం.

గుర‌జాడ సాంస్కృతిక స‌మాఖ్య ప్ర‌తి ఏడాది సంగీతం, గానం, సాహిత్యం, ఆధ్యాత్మిక రంగాల్లో విశిష్ట సేవ‌లు అందించిన ప్ర‌ముఖుల‌కు గుర‌జాడ విశిష్ట పుర‌స్కారాన్ని అంద‌జేస్తోంది. 2000వ సంవ‌త్స‌రం నుంచి గుర‌జాడ పేరుతో పుర‌స్కారాలు అంద‌జేస్తూ ఆ మ‌హ‌నీయుడి సేవ‌ల్ని స్మ‌రించుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News