మార్గదర్శిలో ‘ఘోస్ట్’ లున్నారా?

ఘోస్ట్ ఖాతాదారుల ముసుగులో రామోజీరావు బ్లాక్ మనీ దందా నడుపుతున్నట్లు సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు మార్గదర్శి యాజమాన్యానికి వ్యతిరేకంగా సుమారు 100 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం.

Advertisement
Update:2023-08-21 11:31 IST

మార్గదర్శి చిట్ ఫండ్స్ లో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నట్లున్నాయి. ఇప్పటికే బయటపడిన అనేక అక్రమాలకు తోడు తాజాగా ఘోస్ట్ చందాదారుల విషయం కొత్తగా బయటపడింది. ఘోస్ట్ చందాదారులంటే వాళ్ళకి తెలియకుండానే మార్గదర్శిలో చందాదారులుగా చేరటం. సూళ్ళూరుపేటకు చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి చీరాలలోని మార్గదర్శి బ్రాంచ్‌లో చందాదారుడిగా ఉన్నారు. సూళ్ళూరుపేటకు, చీరాలకు ఏ విధమైన సంబంధంలేదు. అలాంట‌ప్పుడు సుబ్రమణ్యం చందాదారుడిగా ఎలా ఉన్నారు?

ఇదే విషయాన్ని మార్గదర్శిలోని రికార్డుల ఆధారంగా ఫోన్ చేసి సుబ్రమణ్యాన్ని సీఐడీ అధికారులు అడిగారు. వీళ్ళు అడిగేంతవరకు తాను మార్గదర్శిలో చందాదారుడిని అన్న విషయం సుబ్రమణ్యానికి తెలియ‌దట. అంటే సుబ్రమణ్యం ఆధార్ కార్డ్ తో పాటు ఇతర వివరాలను ఎక్కడో సంపాదించి ఆయన పేరుతో యాజమాన్యమే ఒక చందాదారుడి ఖాతా ఓపెన్ చేసింది. అంటే లేని చందాదారుడి పేరుతో చిట్టీ వేయించటమే కాకుండా ప్రతినెలా చిట్టీ డ‌బ్బులు కడుతూ, పాటలు కూడా పాడుతోందన్నమాట. ఇదంతా యాజమాన్యం ఎందుకు చేసిందంటే బ్లాక్ మనీని వైట్ చేసుకోవటం కోసమే అని సీఐడీ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.

ఇలాంటి కేసే అనకాపల్లిలో కూడా బయటపడింది. అంటే యాజమాన్యం తరపున ఇలాంటి ఘోస్ట్ చందాదారులు ఇంకెంత మంది ఉన్నారు అన్న విషయాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఇలాంటి ఘోస్ట్ ఖాతాదారుల ముసుగులోనే రామోజీరావు బ్లాక్ మనీ దందా నడుపుతున్నట్లు సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు మార్గదర్శి యాజమాన్యానికి వ్యతిరేకంగా సుమారు 100 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం.

తమ సంస్థ‌పై ఇంతవరకు ఎవరు ఫిర్యాదు చేయలేదని రామోజీ చెప్పుకోవటం, ఇందుకు ఎల్లో మీడియా తోకపత్రిక యజమాని రాధాకృష్ణ వత్తాసు పలకటం అబద్ధమని తేలిపోయింది. ఇంతకాలం యాజమాన్యానికి ప్రభుత్వంలో ఉండే పట్టు వల్లే వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయటానికి చందాదారులు భయపడ్డారట. చందాదారులు ఎవరైనా ఫిర్యాదులు చేయటానికి పోలీసుస్టేషన్‌కు వెళ్ళినా పోలీసులు ఫిర్యాదును తీసుకునేవారు కారట. ఫిర్యాదు తీసుకోకపోగా ఫిర్యాదుదారు వివరాలను మార్గదర్శికి చేరవేసేవారని ఆరోపణలున్నాయి. అందుకనే ఇప్పుడు సీఐడీ అధికారులు ప్రకటించిన వాట్సప్ నెంబర్‌కు వంద ఫిర్యాదులు అందినట్లు సమాచారం. మరి ఘోస్ట్ లెక్కలు ఎప్పుడు ఫైనల్ అవుతాయో చూడాలి.

Tags:    
Advertisement

Similar News