గాజువాకలో కూడా జనసేన జెండా.. టీడీపీ, బీజేపీకి చోటు లేదా..?

వారాహి యాత్ర వైసీపీకి వణుకు అంటున్నారు కానీ.. వాస్తవానికి టీడీపీ, బీజేపీని వణికిస్తున్నారు పవన్ కల్యాణ్. నియోజకవర్గాలను, కొన్నిచోట్ల అభ్యర్థులను కూడా రిజర్వ్ చేస్తూ.. షాకిస్తున్నారు. ప్రస్తుతం గాజువాక వరకు వచ్చి ఆగారు.

Advertisement
Update:2023-08-14 07:33 IST

"గాజువాకలో నేను ఓడిపోయాను, అయినా ఇంతమంది నాకోసం వస్తారని అనుకోలేదు. ఊహించని ఈ అభిమానం నాకు మరింత బలాన్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గాజువాకలో జనసేన జెండా ఎగురుతుంది. ఆ నమ్మకం నాకుంది." వారాహి మీటింగ్ లో పవన్ చెప్పిన మాటలివి. జనసైనికులకు ఈ స్టేట్ మెంట్లు ధైర్యాన్నివ్వొచ్చేమో కానీ.. టీడీపీ, బీజేపీకి మాత్రం షాకిచ్చాయి. అవును, ఆ రెండు పార్టీలకు మరో నియోజకవర్గంకూడా చేజారిందని తేలిపోయింది.

ఆమధ్య వారాహి యాత్రల్లో భాగంగా కాకినాడ, పిఠాపురం, భీమవరం.. ఇలా అన్నిచోట్లా జనసేన జెండా ఎగురుతుందని ధీమాగా చెప్పుకున్నారు పవన్ కల్యాణ్. తెనాలిలో నాదెండ్ల మనోహర్ ని గెలిపించాలని పార్టీ శ్రేణులకు బహిరంగంగానే పిలుపునిచ్చారు. పెందుర్తి కూడా మనదేనంటూ సిగ్నల్స్ పంపించారు. ఇప్పుడు గాజువాకలో ఎంట్రీ ఇచ్చిన పవన్, ఇక్కడ కూడా జనసేన జెండా ఎగరాలన్నారు. అంటే ఈసారి ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని తేల్చి చెప్పినట్టే. అది పవన్ కావొచ్చు, ఇంకొకరు కావొచ్చు, కానీ పోటీ చేసేది మాత్రం జనసేన అభ్యర్థే. అంటే పొత్తులు, ఎత్తులు అంటున్నా కూడా ఆ సీటు తనకే ఇవ్వాలని పరోక్షంగా టీడీపీ, బీజేపీకి.. జనసేనాని తేల్చి చెప్పినట్టే లెక్క.


గాజువాకతో ఆగుతారా..?

వారాహి యాత్ర వైసీపీకి వణుకు అంటున్నారు కానీ.. వాస్తవానికి టీడీపీ, బీజేపీని వణికిస్తున్నారు పవన్ కల్యాణ్. నియోజకవర్గాలను, కొన్నిచోట్ల అభ్యర్థులను కూడా రిజర్వ్ చేస్తూ.. షాకిస్తున్నారు. ప్రస్తుతం గాజువాక వరకు వచ్చి ఆగారు పవన్. భవిష్యత్తులో మరిన్ని ప్రకటనలుంటాయా..? లేక బతిమాలో బామాలో పవన్ దూకుడుకి చంద్రబాబు అడ్డుకట్ట వేస్తారా..? అనేది వేచి చూడాలి.

అలయన్స్ అధికారికం కాకపోయినా టీడీపీ, జనసేన ఓ మాట మీద ముందుకెళ్తున్నాయనే చెప్పాలి. లోకేష్ యాత్ర చేసిన ప్రాంతాల్లోకి పవన్ రావడంలేదు, పవన్ వచ్చిన చోటకు చంద్రబాబు వెళ్లడంలేదు. ఎవరికి వారే ప్రాంతాలను విభజించుకుని వ్యూహాత్మకంగా యాత్రలు చేస్తున్నారు. యాత్రల వరకు ఓకే కానీ, పవన్ సీట్లు ప్రకటించడమే మిగతావాళ్లకు ఇరకాటంగా మారింది. 

Tags:    
Advertisement

Similar News