NDA విద్వేష DNA గడ్కరీలో లేదా..?

తెలంగాణకు ఫలానా ప్రాజెక్ ఓపెనింగ్ కి కేంద్ర మంత్రి వచ్చారనే ఉదాహరణ లేదు. కేవలం ప్రైవేటు కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు మినహా ఇంకేవీ కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో అక్కడ జరగలేదు.

Advertisement
Update:2022-09-23 06:21 IST

ఓ కేంద్ర మంత్రి ఏపీకి వచ్చారు. 2850 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సభ పెట్టారు, మాట్లాడారు, మరికొన్ని ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. విచిత్రం ఏంటంటే.. ఆయన స్థానిక ప్రభుత్వం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం. ఇదే కార్యక్రమం తెలంగాణలో పెడితే పరిస్థితి ఎలా ఉండేది? అసలు తెలంగాణకు కేంద్ర మంత్రులు వస్తే ఏం చేస్తారు..? ఆ హడావిడి మామూలుగా ఉండదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తిట్ల దండకం అందుకుంటారు. విమర్శలు చేస్తారు, విద్వేషాలు రెచ్చగొడతారు. కార్ల అద్దాలు పగలగొడతారు. అబ్బో ఇంకా చాలా చాలానే చేస్తారు. అట్లుంటది వారితోని.

కానీ గడ్కరీ ఆ టైప్ కాదు. ఇప్పటికే చాలాసార్లు ఈ విషయం రుజువైంది. NDAలో ఉన్న విద్వేష DNA ఆయలో లేదనే చెప్పాలి. అందుకే ఆయన్ని ఏపీకి పంపించి కేంద్రం చేతులు దులుపుకుంది. అలాంటి నేతల్ని తెలంగాణకు పంపించినా పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే అక్కడికి అమిత్ షా, నిర్మల, శోభ.. ఇలా హడావిడి బ్యాచ్ వెళ్తుంటారు. రెండు తిట్టి, నాలుగు తిట్టించుకుని వస్తుంటారు స్థానికంగా పెద్ద కలకలం సృష్టిస్తారు.

రెండు రాష్ట్రాల్లో ఎంత తేడా..?

రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్రం వైఖరి ఎలా ఉందో స్పష్టం చేసే సందర్భం ఇది. తెలంగాణకు ఎప్పుడూ ఫలానా ప్రాజెక్ ఓపెనింగ్ కి కేంద్ర మంత్రి వచ్చారనే ఉదాహరణ లేదు. కేవలం ప్రైవేటు కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, రెచ్చగొట్టే కార్యక్రమాలు మినహా ఇంకేవీ కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో అక్కడ జరగలేదు. కానీ ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రులు వస్తున్నారు. ఇక్కడకు సైలెంట్ బ్యాచ్ ని పంపిస్తున్నారు. అక్కడ మాత్రం వయలెంట్ గా ఉండేవాళ్లని ఏరికోరి పంపిస్తున్నారు. నితిన్ గడ్కరీ సభను ఏపీ మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదంటే అందులో మసాలా ఏమాత్రం లేదని అర్థమవుతోంది. ఆయనతోపాటు రాష్ట్రమంత్రి దాడిశెట్టి రాజా, ఐదుగురు వైసీపీ ఎంపీలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నా పలకరింపులు మినహా పరుషమైన మాటలు బయటకు రాలేదు. ఏపీ బీజేపీ నేతలు కూడా కేంద్ర మంత్రిని చూసి రెచ్చిపోలేదు. ఇదే సభ తెలంగాణలో జరిగితే.. కేంద్ర మంత్రిని పక్కనపెట్టుకుని రాష్ట్ర నేతలు ఎంత రెచ్చిపోయేవారో అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి దృష్టిలో పడాలని, వారిని ఆకాశానికెత్తేస్తూ, స్థానిక ప్రభుత్వాన్ని తప్పుబట్టేవారు. ఏపీ, తెలంగాణ విషయంలో కేంద్రం వైఖరి ఎలా ఉందో చెప్పే ఉదాహరణ ఇది.

Tags:    
Advertisement

Similar News