ఏపీలో ఫర్నిచర్ రాజకీయం.. ఎవరు చెప్పేది నిజం..?
ప్రభుత్వ జీవోల ప్రకారం ఆయా వస్తువుల రేట్లను అనుసరించి ఖరీదుకట్టాలని క్యాంప్ కార్యాలయం... అధికారులను కోరినట్టు వైసీపీ వివరణ ఇచ్చింది.
అప్పట్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ని ఫర్నిచర్ దొంగ అంటూ వైసీపీ టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ ని కూడా అలాగే టీడీపీ టార్గెట్ చేయాలని చూస్తోంది. జగన్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ఫర్నిచర్ ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. రూ.39లక్షల విలువైన ఫర్నిచర్ ని క్యాంప్ కార్యాలయంలో ఉంచుకున్నారని, అధికారం కోల్పోయాక దాన్ని తిరిగి ఇవ్వలేదని నిందలు వేస్తోంది. క్యాంప్ కార్యాలయంలో ఎలక్ట్రిక్ వర్క్స్, సెక్యూరిటీ ఏర్పాట్లు, మెయింటెనెన్స్ కింద కోట్లు ఖర్చుపెట్టారని.. టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కవ్వింపు చర్యలకు పాల్పడింది.
వైసీపీ సమాధానం..
టీడీపీ ట్వీట్ కి వైసీపీ కూడా ఘాటుగా రియాక్ట్ అయింది. సిగ్గులేకుండా టీడీపీ నేతలు నీతిమాలిన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేతలు. పైశాచిక పోస్టింగ్ లు పెడుతున్నారని, మంత్రులు కూడా స్థాయి దిగజారి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం నుంచి పొందిన ఫర్నిచర్ జాబితాను ఇప్పటికే జగన్ క్యాంపు కార్యాలయం ప్రభుత్వానికి సమర్పించిందని చెప్పారు. ప్రభుత్వ జీవోల ప్రకారం ఆయా వస్తువుల రేట్లను అనుసరించి ఖరీదుకట్టాలని క్యాంప్ కార్యాలయం... అధికారులను కోరినట్టు వైసీపీ వివరణ ఇచ్చింది. ఈమేరకు ఫైల్ కూడా పెట్టారని, ఆ ఫైల్ ప్రాసెస్ లో ఉండగానే, తమపై ఇలా నిందలు వేయడం సరికాదంటున్నారు వైసీపీ నేతలు.
ఈ వివాదంలోకి కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం కూడా ఎంట్రీ ఇచ్చారు. గతంలో తన తండ్రిపై అనవసరంగా అభాండాలు వేశారని ఇప్పుడు జగన్ పై కూడా కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో తన వద్ద ఫర్నిచర్ ఉందని, స్వయంగా తన తండ్రి చెప్పారని, ఆ తర్వాతే అధికారుల్లో కదలిక వచ్చిందని అన్నారు. ఇప్పుడు జగన్ పై కూడా కేసు పెట్టాలంటున్నారు జూనియర్ కోడెల. టీడీపీ ఆరోపణలు, వైసీపీ వివరణ.. ఈ మధ్యలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఫర్నిచర్ రాజకీయం మాత్రం ఆసక్తికరంగా మారింది.