సాక్షిలో ఈనాడుకి ఫుల్ కవరేజ్..
19 సీట్ల చంద్రబాబుని చూసి బలవంతుడు అనుకోవడం, అనుకూల మీడియా సహాయంతో ఏదో చేసేస్తాడని భయపడటం, పేపర్ నిండా ప్రతిపక్షాన్ని నింపేసి తూర్పారబట్టడం కాస్త విచిత్రంగా తోస్తోంది.
సాక్షిపేపర్ చదివితే చాలు ఈనాడు కూడా చదివినట్టే లెక్క. అవును.. ఇటీవల కాలంలో ఈనాడులో వచ్చిన వార్తలన్నిటికీ మరుసటి రోజు సాక్షి ఖండనలు ఇచ్చుకుంటూ వస్తోంది. ఒకటీ రెండు వార్తలతో మొదలైన ఈ అలవాటు ఇప్పుడు ఈనాడుకి సాక్షి ఫుల్ కవరేజ్ ఇచ్చే వరకు వచ్చేసింది.
ఈనాడుపై జనాగ్రహం..
దిగజారుడు పాత్రికేయం..
టిడ్కో ఇళ్లపై క్షుద్ర రాతలు..
ఈనాడు అసత్య యజ్ఞం..
ఇవన్నీ మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి హెడ్డింగ్ లు, వివరణలు, ఖండనలు.. ప్రతి రోజూ సాక్షిలో కనిపిస్తూనే ఉన్నాయి. చంద్రబాబుకంటే ఎక్కువగా రామోజీ ఫొటోలే సాక్షిలో కనపడుతున్నాయంటే ఒకరకంగా ఈనాడుకి సాక్షి ఫుల్ పబ్లిసిటీ ఇస్తున్నట్టే లెక్క.
సాక్షిలో ఖండన వార్తలు చదివిన ప్రతి ఒక్కరికీ అసలు ముందురోజు ఈనాడులో ఏం వచ్చిందో చదవాలన్న కుతూహలం కలుగుతోంది. ప్రతి రోజూ ఈ ఖండనలు చదవడం అలవాటయితే.. సాక్షి చందాదారులు కూడా ఈనాడు చందాదారులు కావడం ఖాయం. ఓవైపు ఆ పత్రికలు చదవొద్దు, ఆ దుష్టచతుష్టయం జోలికి పోవద్దు అంటూ సీఎం జగన్ బహిరంగ సభల్లో మొత్తుకుంటున్నా.. సాక్షి మాత్రం వివరణలిచ్చుకోడానికి ఆసక్తి చూపించడం విశేషం.
బాబు వ్యూహంలో చిక్కుకున్నట్టేనా..?
ఈనాడు రాతలు చంద్రబాబు చేతలు ఒకటే. కానీ చంద్రబాబుని విమర్శించే క్రమంలో సాక్షి ఫోకస్ మొత్తం ఈనాడుపైకి మారిపోయింది. ఇక్కడ వ్యాపారంలో ఉన్న పోటీ మినహా మిగతాది ప్రజలకు అనవసరం. సీఎం జగన్ ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాల్సిన ఎన్నికల టైమ్ లో.. 19 సీట్ల చంద్రబాబుని చూసి బలవంతుడు అనుకోవడం, అనుకూల మీడియా సహాయంతో ఏదో చేసేస్తాడని భయపడటం, పేపర్ నిండా ప్రతిపక్షాన్ని నింపేసి తూర్పారబట్టడం కాస్త విచిత్రంగా తోస్తోంది. ఈనాడు నిజంగానే బురదజల్లుతోంది అనుకుంటే.. దాన్ని కడుక్కోడానికే అధికార పక్షానికి, అధికార పార్టీ అనుకూల మీడియాకి టైమ్ సరిపోతోంది. ఎన్నికల సమయం దగ్గరపడేనాటికి ఈ పేపర్ యుద్ధం ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి.