వెళ్లనంటే వెళ్లను.. చంద్రబాబుపై గంటా తిరుగుబాటు
తనను చీపురుపల్లి వెళ్లాలని పార్టీ చెప్పిందని, కానీ చీపురుపల్లిపై నిర్ణయం తీసుకోలేదని, అది తనకు 150 కిలోమీటర్ల దూరంలో ఉందని, పైగా జిల్లా కూడా వేరే కావడంతో ఆలోచనలో పడ్డానని ఆయన చెప్పారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఆ పార్టీ మాజీ ఎమ్యెల్యే గంటా శ్రీనివాస రావు నిరసన గళం విప్పారు. తాను చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. తనకు ఈసారి విశాఖపట్నం నుంచే పోటీ చేయాలని ఉన్నట్లు ఆయన తెలిపారు. తాను విశాఖ నార్త్ నుంచి పోటీ చేయడం లేదని, విశాఖ నార్త్‌లో వేరే ఇంచార్జీని పెట్టాలని సూచించానని ఆయన అన్నారు.
తనను చీపురుపల్లి వెళ్లాలని పార్టీ చెప్పిందని, కానీ చీపురుపల్లిపై నిర్ణయం తీసుకోలేదని, అది తనకు 150 కిలోమీటర్ల దూరంలో ఉందని, పైగా జిల్లా కూడా వేరే కావడంతో ఆలోచనలో పడ్డానని ఆయన చెప్పారు. ఇంకా టీడీపీ, జనసేన సీట్ల లెక్క తేలలేదని, కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చిందని, వారం రోజుల్లో జాబితా ప్రకటించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
తానైతే విశాఖపట్నం జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నానని, తనను ఈ జిల్లా నుంచి పంపేద్దామనుకుంటున్నారా అని, తన అభిప్రాయాలను పార్టీ నాయకులకు చెప్తానని, రెండు రోజుల్లో నిర్ణయం ఏమిటనేది చెప్తానని ఆయన వివరించారు. ప్రతి ఎన్నికల్లో తాను నియోజకవర్గం మారుతున్నానని, కానీ ఇప్పుడు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉందని గంటా శ్రీనివాసరావు చెప్పారు.