శైలజానాథ్‌ నోట కూడా మాట మారింది..!

దాంతో శైలజానాథ్‌ పార్టీ మారుతారన్న అభిప్రాయానికి అవకాశం ఏర్పడింది. నిజానికి శైలజానాథ్‌ 2014లోనే పక్క చూపులు చూశారు. టీడీపీ తరపున దాదాపుగా బీఫాం కూడా సాధించేశారు.

Advertisement
Update:2022-12-28 08:10 IST

ఏపీ కాంగ్రెస్‌లో ఎవరూ మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. మొన్నటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా చేసిన శైలజానాథ్ నోట కూడా మాట మారింది. తాము ఆఖరి వరకు కాంగ్రెస్‌తోనే అని గతంలో చెప్పిన శైలజనాథ్ ఇప్పుడు మాత్రం మూడు నెలలు ఆగి చెబుతా అంటున్నారు. 2024లోనూ శింగనమల నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌ నుంచి అని మాత్రం గ్యారెంటీ ఇవ్వలేదు.

కాంగ్రెస్‌లోనే కొనసాగే వ్యక్తి అయి ఉంటే ఆ పార్టీ నుంచే పోటీ చేస్తా అని చెప్పి ఉండేవారు. అలా కాకుండా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను అన్నది మూడు నెలల తర్వాత ప్రకటిస్తానని చెప్పేశారు. అంటే ఆయనకు మరో ఉద్దేశం ఉందన్నది స్పష్టమవుతోంది. టీడీపీ నుంచి పోటీ చేస్తారా అని ప్రశ్నించగా.. మూడు నెలల తర్వాత అన్ని వివరాలు చెబుతానని దాటవేశారు.

దాంతో శైలజానాథ్‌ పార్టీ మారుతారన్న అభిప్రాయానికి అవకాశం ఏర్పడింది. నిజానికి శైలజానాథ్‌ 2014లోనే పక్క చూపులు చూశారు. టీడీపీ తరపున దాదాపుగా బీఫాం కూడా సాధించేశారు. టీడీపీ తరపున నామినేషన్ సమయంలో మాజీ మంత్రి శమంతకమణి అడ్డుపడ్డారు. నిన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉండి ఇప్పుడు టీడీపీ నుంచి ఎలా పోటీ చేస్తావంటూ అడ్డుపడ్డారు. దాంతో శైలజానాథ్‌ కాంగ్రెస్ నుంచే పోటీ చేశారు.

ఆ ఎన్నికల్లో శమంతకమణి కుమార్తె యామినీబాల టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఆమెకు టికెట్ దక్కలేదు. జేసీ దివాకర్ రెడ్డి అనుచరవర్గంగా ముద్రపడ్డ బండారు శ్రావణికి టికెట్ ఇచ్చారు. ఆమె ఓడిపోయారు. ఇప్పుడు ఆమెకూ నియోజకవర్గంలో వర్గపోరు ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో శైలజానాథ్ టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఆయన మాటలతో బలపడుతోంది. శమంతకమణి, ఆమె కుమార్తె యామినీబాల ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News