రామోజీపై ఉండవల్లి కొత్త ఆరోపణలు..అంత బ్లాక్ మనీయా ?
రూ. 17 వేల కోట్ల ఆస్తులున్న రామోజీ ఒక వ్యవస్థను శాసిస్తున్నట్లు ఉండవల్లి మండిపోయారు. చిట్ నిర్వాహకులు ఇతర వ్యాపారాలు చేయకూడదని నిబంధనలు, సుప్రింకోర్టు తీర్పులున్నా రామోజీ దేన్నీ లెక్కచేయటంలేదన్నారు.
మార్గదర్శి చిట్ ఫండ్స్ మోసాల్లో ఏ-1 నిందితుడిగా విచారణను ఎదుర్కొంటున్న రామోజీరావుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొత్త ఆరోపణలు చేశారు. ఉండవల్లి మీడియా సమావేశం పెడుతున్నారంటేనే రామోజీ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నట్లుగా ఫీలవుతుంటారేమో. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ మాట్లాడుతూ రామోజీ దగ్గర ఉన్న డబ్బంతా మొత్తం బ్లాక్ మనీనే అయ్యుండాలని అనుమానాన్ని వ్యక్తంచేశారు. ఉండవల్లి అనుమానం వ్యక్తంచేశారంటేనే అందులో నిజముంటుందనే అనుకోవాలి.
ఎందుకంటే.. తన ఆరోపణలకు ఆధారాలు లేకుండా ఉండవల్లి ఏ విషయంపైనా మాట్లాడరు. కాబట్టి రామోజీ దగ్గరున్న డబ్బంతా బ్లాక్ మనీయే అని చెప్పారంటే అదికూడా నిజమే అయ్యుండాలి. తెలుగురాష్ట్రాల్లో రామోజీకి వచ్చే రోజు ఆదాయం రు. 10 కోట్లట. అంటే 365 రోజులకు గాను ఏడాదికి సుమారు ఆదాయం రు. 3,650 కోట్లు. ఏపీలో చిట్ వ్యాపారం చేస్తున్న ఏ సంస్థకూడా నిబంధనలను పాటించటంలేదట. అలాగే ఏ సంస్థ కూడా జీఎస్టీ, టీడీఎస్ కట్టడంలేదని ఆరోపించారు.
రూ. 17 వేల కోట్ల ఆస్తులున్న రామోజీ ఒక వ్యవస్థను శాసిస్తున్నట్లు ఉండవల్లి మండిపోయారు. చిట్ నిర్వాహకులు ఇతర వ్యాపారాలు చేయకూడదని నిబంధనలు, సుప్రింకోర్టు తీర్పులున్నా రామోజీ దేన్నీ లెక్కచేయటంలేదన్నారు. రామోజీ తన వ్యాపారాలకు ఇటు రాష్ట్ర చట్టాలు వర్తించవు అటు కేంద్రప్రభుత్వం చట్టాలు వర్తించవన్నట్లుగా అడ్డుగోలుగా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవాచేశారు. ప్రభుత్వాలు రూపొందిచిన చట్టాలను కాకుండా తాను సొంతంగా చట్టాలను ఏర్పాటుచేసుకుని దానిప్రకారమే వ్యాపారాలను చేసుకుంటున్నట్లు రామోజీపై ఉండవల్లి ధ్వజమెత్తారు.
సీఐడీ అధికారుల విచారణలో కూడా రామోజీ కోడలు, మార్గదర్శి ఎండీ శైలజ ఇదే విషయాన్ని చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డీ మీడియా చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. తమ సంస్థలో ప్రత్యేకంగా ఫైనాన్షియల్ పాలసీలు పెట్టుకుని దాని ప్రకారమే నడుపుకుంటామని శైలజ చెప్పారట. అంటే ప్రభుత్వాలన్నా, చట్టం, న్యాయమంటే రామోజీకి ఎంత గౌరవముందో అర్థమైపోతోంది. రామోజీ అద్దాల మేడలో కూర్చుని ఎదుటి వాళ్ళపై రాళ్ళు విసురుతుండటమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది.