తప్పులు జరిగాయి.. ఓడిపోయాం
తన ఓటమికి రోడ్డు గోతులే ప్రధాన కారణమన్నారు. ఎన్నికలకు ముందు సీఎం జగన్‌కు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోలేదన్నారు.
ఎన్నికల్లో ఘోర పరాజయం వైసీపీ నేతలను ఇంకా బాధిస్తూనే ఉంది. ఓటమి నుంచి వైసీపీ నేతలు తేరుకున్నట్లు లేదు. అంత దారుణంగా ఓడిపోవడం చాలా మందికి అర్థం కాని విషయంలా మారింది. అయితే కొందరు మాజీ ఎమ్మెల్యేలు మాత్రం తమ ఓటమికి కారణాలివేనంటూ మీడియా ముందుకు వస్తున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో అనేక తప్పులు జరిగాయన్నారు కరణం ధర్మశ్రీ. వాటిని సరిదిద్దుకోకపోవడం వల్లే ప్రజలు వైసీపీని తిరిస్కరించారని చెప్పారు. వ్యవస్థాగతంగా, పరిపాలనపరంగా చేసిన తప్పిదాలే ఓటమికి దారి తీశాయన్నారు. ఇక తన ఓటమికి రోడ్డు గోతులే ప్రధాన కారణమన్నారు. ఎన్నికలకు ముందు సీఎం జగన్‌కు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోలేదన్నారు. ఫలితంగా 42 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయానన్నారు. రోడ్డు కోసం సొంత నిధులు రూ.2 కోట్లు ఖర్చు చేశానన్నారు ధర్మశ్రీ. కూటమి ప్రభుత్వం ఆ డబ్బులు ఇస్తుందో, లేదో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలిసో.. తెలియక చేసిన తప్పుల వల్ల ప్రజలు వైసీపీకి అధికారం దూరం చేశారన్నారు ధర్మశ్రీ. ఈ విషయాన్ని ఇప్పటికే అంగీకరించామన్నారు. ఓటమితో కుంగిపోవద్దన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని, తనకు గెలుపోటములు కొత్త కాదన్నారు. దాడుల సంస్కృతి సరికాదని టీడీపీ నేతలకు సూచించారు.